ప్రజా సమస్యలే అజెండా కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలే అజెండా కావాలి

Feb 12 2026 7:01 AM | Updated on Feb 12 2026 7:01 AM

ప్రజా సమస్యలే అజెండా కావాలి

ప్రజా సమస్యలే అజెండా కావాలి

ప్రజా సమస్యలే అజెండా కావాలి

పార్వతీపురం రూరల్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వివాదాలకు స్వస్తి పలికి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం హితవు పలికారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్వతీపురంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లడ్డూ వివాదానికి తక్షణమే చరమగీతం పాడాలని, అపచారానికి కారకులైన వారిపై విచారణ జరిపి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీల అమలు ఎటు పోయిందని ఆయన ప్రశ్నించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, చట్టం నుంచి గాంధీ పేరును తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. ఉపాధి హామీ పరిరక్షణలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి త్వరలోనే జిల్లాలో పర్యటించనున్నట్లు వెల్లడించారు.దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న జంఝావతి ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని శీలం డిమాండ్‌ చేశారు. ఐటీడీఏ సమావేశాలు నిర్వహించి గిరిజన విద్యార్థుల మరణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పార్వతీపురం మున్సిపాలిటీలో తాగునీరు, డంపింగ్‌ యార్డ్‌ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మాని, రాజ్యాంగ బద్ధంగా, సర్వమత సామరస్యంతో పాలన సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహేష్‌, శాంతి కుమారి, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌, పలువురు నియోజకవర్గ కోఆర్డినేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement