రుణం మరొకరికి
సాగులో ఒకరు..
చీపురుపల్లి: ‘వడ్డించే వాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా’ అనే సామెతను పీఏసీఎస్ ఉద్యోగులు ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ భూములను తనఖా పెట్టుకుని ఇచ్చే రుణాల్లో నిబంధనలు పాటించకుండా లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేయడం చర్చశనీయాంశమవుతోంది. వ్యవసాయ భూములు సాగు చేసేది ఒకరైతే పీఏసీఎస్ ఉద్యోగులు రుణం ఇచ్చేది మరొకరికి కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. భూముల తనఖా ద్వారా రుణాలు ఇచ్చే అంశంలో క్షేత్రస్థాయి పరిశీలన చాలా కీలకమైన నిబంధన. ఆ నిబంధనను పక్కన పెట్టి ఆ భూముల్లో ఎవరున్నారో నిర్థారించుకోకుండా రుణాలు మంజూరు చేయడం వెనుక ఆంతర్యమేమిటనే చర్చ సాగుతోంది. చీపురుపల్లి మండలంలోని కర్లాం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్)లో సరిగ్గా అలాంటి సంఘటనే వెలుగుచూసింది. భూములు సాగు చేసుకుంటున్న వారికి కాకుండా వేరే వారికి ఆ భూముల్లో రూ.15 లక్షల రుణాన్ని మంజూరు చేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. అన్ని ధ్రువీకరణ పత్రాలు చూసే రుణం మంజూరు చేశామని పీఏసీఎస్ ఉద్యోగులు చెబుతుంటే నాలుగు దశాబ్దాలుగా ఆ భూములు తమవని తాతతండ్రుల నుంచి తామే సాగు చేసుకుంటున్నామని, రిజిస్టర్డ్ ధ్రువీకరణ పత్రాలు కూడా ఉన్నాయని రైతులు శనపతి సూర్యనారాయణ, కొమ్మాన వీరభద్రుడు, బాలి రామినాయుడు, బాలి అప్పారావులు అంటున్నారు.


