పాముకాటుతో వ్యక్తి మృతి
సంతకవిటి: మండలంలోని సిరిపురం పంచాయతీ యాగాటిపేట గ్రామానికి చెందిన చీర ఆనందరావు (పత్రికా ప్రతినిధి) పాముకాటుతో సోమవారం మృతి చెందారు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆనందరావు మధ్యాహ్నం పొలానికి వెళ్లగా పొలంలో పాముకాటు వేసింది. పాము కరిచిన విషయం తన తమ్ముడికి సమాచారం అందించి అక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు వెళ్లే సరికి అపస్మారక స్థితిలో ఆనందరావు పడి ఉండడం గమనించి 108కు సమాచారం అందించారు. 108 వాహనం ద్వారా శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. ఆయనకు భార్య సత్యవతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
నెల్లిమర్ల: పట్టణ పరిధిలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనిపై స్థానికులు అందించిన వివరాల ప్రకారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో నివసిస్తున్న బుడుమూరి రాము(32) సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వ్యక్తిగత పనినిమిత్తం మిమ్స్ వైపు వెళ్లాడు. స్థానిక బ్రిడ్జి దిగువన రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే రాము చనిపోయాడు. ఆయనకు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం రూరల్: భార్య తనను విడిచి వెళ్లిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పరజపాడు గదబవలస గ్రామానికి చెందిన బొడ్ల శ్రీనివాసరావు భార్య 20 ఏళ్ల క్రితం ఆయనను విడిచి వెళ్లిపోయింది. నాటి నుంచి ఒంటరిగా జీవిస్తున్న ఆయన, ఆ వేదనతో మద్యం మత్తులో గడ్డిమందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
పశువుల పాక, ధాన్యం,
గడ్డివాములు దగ్ధం
మెంటాడ: మండలంలోని తమ్మిరాజుపేట గ్రామంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించి గ్రామానికి చెందిన రైతు మన్నేల అక్కయ్యకు సంబంధించిన పశువుల పాక, ధాన్యం నిల్వ చేసే పురి, నాలుగు గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మంటలు పక్కనే ఉన్న మన్నేల సోమేష్, సిరిపురం సత్యం, సిరిపురం పెద్ద నారాయణ, పంచాడ కొండమ్మలకు చెందిన టేకు తోటలకు వ్యాపించడంతో పరిస్థితి తీవ్రమైంది. స్థానికులు వెంటనే గజపతినగరం ఫైర్ స్టేషన్‌న కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది తక్షణమే ఫైర్ ఇంజిన్‌తో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ అగ్నిప్రమాదం ఉదయం బహిర్భూమికి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ కాల్చి పూర్తిగా ఆర్పకుండా వెళ్లిపోవడం వల్లే సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు.


