గాలిలో దీపంలా ప్రాణాలు
పార్వతీపురం రూరల్: జిల్లాలో మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. నాడు వైఎస్సార్సీసీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా, మారుమూల ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేయాలని సంకల్పించిన ‘మల్టీ స్పెషాలిటీ’ ఆస్పత్రి కల నేడు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యపు నీడలో చిక్కుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించేలా అడుగులు పడితే.. నేటి పాలకులు ఆ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ఫలితంగా అత్యవసర సమయాల్లో ఆపన్నహస్తం అందక, విశాఖ కేజీహెచ్‌కు వెళ్లే దారిలోనే నిరుపేదల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి.
నాడు సంకల్పం..నిధుల వెల్లువ
గిరిజన ప్రాంతాల్లో వైద్య విప్లవానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబర్ 2న శ్రీకారం చుట్టారు. పార్వతీపురంతో పాటు ఐదు ఐటీడీఏల పరిధిలో ఏడు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఒక్క పార్వతీపురానికే రూ.49.26 కోట్లు కేటాయించడమే కాకుండా, మాతా శిశు సంరక్షణ కోసం అదనంగా మరో రూ.21.15 కోట్లు మంజూరు చేశారు. కరోనా వంటి కష్టకాలంలోనూ వెనకడుగు వేయకుండా, స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పర్యవేక్షణలో స్థల సేకరణ, అనుమతుల ప్రక్రియను పరుగులు పెట్టించారు. గిరిజనులు అత్యవసర చికిత్స కోసం దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని విశాఖ కేజీహెచ్‌కు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా, ’ఆరోగ్యశ్రీ’ ద్వారా స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ సేవలు అందించడమే లక్ష్యంగా పనులు ప్రారంభమయ్యాయి.
నేడు ఉదాసీనత
2024 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసింది. అప్పట్లో శరవేగంగా సాగిన ఆస్పత్రి పనులు నేడు కుంటుపడ్డాయి. జిల్లా కేంద్రాస్పత్రి నుంచి రిఫరల్ గండాన్ని గట్టెక్కించే ఈ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తి చేయడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఫలితంగా రోడ్డు ప్రమాదాలకు గురైన వారైనా, గుండెపోటు వంటి అత్యవసర బాధితులైనా 146 కిలోమీటర్ల సుదూర ప్రయాణం చేయాల్సి వస్తోంది. సమయానికి వైద్యం అందక మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్న హృదయ విదారక దశ్యాలు నిత్యకత్యమవుతున్నాయి.
పాలకుల నిర్లక్ష్యంతో ఆగిన పనులు
ప్రజలకు మంచి చేయాలన్న ఉన్నతమైన ఆశయంతో, ప్రజలకు, నిరుపేద గిరిజన బిడ్డల ప్రాణాలను కాపాడాలన్న సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూపకల్పన చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలన్న తపనతో అవసరమైన నిధులను కూడా మంజూరు చేశారు. కానీ, నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయాలన్న కనీస ఇంగితం లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో నిధులు మంజూరై, నిర్మాణం తుది దశలో ఉన్నా నేటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ముందుకు జరిగే దిశగా అడుగులు పడడం లేదు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి, ప్రైవేటుపరాన్ని చేయాలని చూడడం అలాగే రాజకీయ కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత బాధాకరం.
అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం
విశాఖ చేరేలోపే ఆగిపోతున్న ఊపిరి
నత్తనడకన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు
నాటి ప్రభుత్వంలో రూ.61 కోట్లు మంజూరు
అయినా ముందుకు సాగని పనులు


