రోడ్డెక్కిన రైతులు
● ప్రభుత్వానికి వ్యతిరేకంగా
మిన్నంటుతున్న నిరసనలు
భోగాపురం: విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో జిల్లా ఉన్నతాధికారులు వివిధ సంస్థలకు భూములను అప్పగించేందుకు భూములను పరిశీలించడంతో పాటు నిర్వహిస్తున్న సర్వేలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న అందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వేల ఎకరాలు సేకరించిన తరువాత కూడా మళ్లీ అదనపు భూసేకరణకు సిద్ధమవడం రైతాంగంలో తీవ్ర అసంతృప్తి నింపింది. రైతన్నలను కాపాడాల్సిన కూటమి ప్రభుత్వం అదే రైతుల పొట్ట మీద కొట్టేందుకు సిద్ధమవుతోంది. విమానాశ్రయానికి సుమారు మూడు వేల ఎకరాల భూములను సేకరించిన ఈ ప్రభుత్వం చుట్టుపక్కల గ్రామాల నుంచి మరో మూడు వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో భోగాపురం మేజర్ పంచాయతీ, మండలంలోని నందింగాం పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాలకు చెందిన రైతులు ఏకమై మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వమంటూ ఆదివారం నిరసనకు దిగారు. వ్యవసాయ భూములే ఆధారంగా బతుకుతున్న రైతులకు, భూమి కోల్పోవడం వల్ల వారికి భవిష్యత్తుపై భయం కలుగుతుంది. రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే తమ భూములను సేకరించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో భోగాపురం పంచాయతీకి చెందిన రైతులు జాతీయ రహదారిని అనుకుని భారీ టెంట్లు వేసి పెద్దఎత్తున రైతాంగమంతా వేదికను ఏర్పాటు చేసుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
రోడ్డెక్కిన రైతులు


