భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
● దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శోభారాణి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 15 నుంచి జరగనున్న శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) కె. శోభారాణి ఆదేశించారు. రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ ఉత్సవాల్లో స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ముఖ్యంగా క్యూల ఏర్పాటు అత్యంత కీలకమని, నిర్ణీత గడువులోగా క్యూలను దృఢంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎటువంటి తోపులాటలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఓ వై. శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.


