వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
చికెన్
● ఘనంగా సూఫీ సుగంధ ఉరుసు మహోత్సవం
● ఖాదర్‌బాబా చిత్రపటంతో పురవీధుల్లో భారీ ఊరేగింపు
● ఖాదర్‌బాబాను దర్శించుకున్న ప్రముఖులు
విజయనగరం టౌన్: ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. బాబామెట్ట భక్తిభావంతో నిండిపోయింది. జన సందోహంతో కోలాహలంగా మారింది. సూఫీ ఆధ్యాత్మిక ధృవతార హజరత్ బాబా సయ్యద్ ఖాదర్ అవులియా 67వ ఉరుసు మహోత్సవాల వేడుకలలో భాగంగా రెండో రోజు బాబాను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో బాబామెట్ట జనసందోహంగా మారిపోయింది. శుక్రవారం వేకువజాము నుంచి ఖాదర్‌బాబా శయన మందిరం దర్గాలో ఖురాన్ పఠనం నిర్వహించారు. హజరత్ ఖాదర్‌బాబా ప్రియశిష్యులు, అలుపెరగని అన్నదాత హజరత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాగ్దాదీ బాబా కుమారులు, సూఫీ పరంపర అభిషక్తులైన విజయనగరం ఖాదర్‌బాబా దర్గా, దర్బార్ షరీఫ్ ధర్మకర్త ముతవల్లి డాక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ సాబిరీ (ఖలీల్‌బాబు) నేత్రత్వంలో ఉత్సవాలను సందడిగా నిర్వహించారు. బాబా జీవించిన కాలం నుంచే అనాదిగా వస్తున్న చిత్రపటాన్ని రథంపై ఎక్కించి సందల్ (ఊరేగింపు) నిర్వహించారు. భాజాభజంత్రీలతో, మేళతాళాలతో, ఫకీరు కవ్వాళీలతో విజయనగరం బాబామెట్ట నుంచి ప్రారంభమైన ఊరేగింపు నల్లచెరువు, కాటవీధి, ఆబాద్‌వీధుల మీదుగా అంబటిసత్రం, ప్రెస్‌క్లబ్, మూడులాంతర్లు, మెయిన్‌రోడ్డు, గంటస్తంభం, బాలాజీకూడలి, కోట జంక్షన్, అయ్యకోనేరు గట్టు, రింగురోడ్డు రైతు బజార్, బాబామెట్ట ఏడుకోవెళ్లు మీదుగా తిరిగి ఖాదర్‌బాబా దర్గాకు చేరుకుంది. అనంతరం మెట్టపై ఉన్న దర్గాలో ఖాదర్‌బాబాకు నూతన సుగంధ, చాదర్ సమర్పించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్ర పూజలు నిర్వహించారు. దర్గా కింద ఉన్న దర్బార్ లంగర్ ఖానాలో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ప్రభుత్వ, రాజకీయ ప్రముఖులు, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు, సామాజిక సేవా ప్రముఖులు, ఖాదర్‌బాబా దర్శనార్ధం దర్గా, దర్బార్‌కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్బార్ సంప్రదాయం ప్రకారం ముతవల్లి డాక్టర్ ఖలీల్‌బాబు వారికి స్వాగతం పలికారు. వేలాది మంది భక్తులు బాబాను దర్శించి, తరించారు.
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత


