పోలీసులకు ‘పునశ్చరణ’
● 15 రోజుల పాటు సాయుధ దళాలకు ప్రత్యేక శిక్షణ
● ప్రారంభించిన ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి
పార్వతీపురం రూరల్ : జిల్లా పోలీసు వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆర్మడ్ రిజర్వు (ఏఆర్) పోలీసుల వృత్తి నైపుణ్యానికి పదును పెట్టేందుకు మొబిలైజేషన్ (పునశ్చరణ) తరగతులు ప్రారంభమయ్యాయి. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఈ శిక్షణా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు 15 రోజుల పాటు సాగే ఈ శిబిరంలో సిబ్బందికి సర్వతోముఖాభివృద్ధిపై తర్ఫీదు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. క్రమశిక్షణకు డ్రిల్ ప్రాణవాయువు వంటిది అని పేర్కొంటూ, విధుల్లో చురుకుదనం, శారీరక దారుఢ్యం పెంపొందించుకోవడమే ఈ మొబిలైజేషన్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. వివిధ రకాల ఆయుధాల వినియోగం, ఫైరింగ్ ప్రాక్టీస్, బాంబు స్క్వాడ్ పనితీరు మరియు బందోబస్తు విధుల్లో మెలకువలపై ఈ సందర్భంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం వృత్తిపరమైన అంశాలే కాకుండా, పోలీసుల వ్యక్తిగత సంక్షేమంపై కూడా ఈసారి దృష్టి సారించారు. విధుల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, సర్వీసు నిబంధనల పట్ల సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరావు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్.ఐలు నాయుడు, రాంబాబు, శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


