సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: ప్రజలు సంతృప్తి చెందే విధంగా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం పీహెచ్‌సీ వైద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల పట్ల వైద్యులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రుల్లో మందులు కొరత లేకుండా చూడాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రోగులు సంతృప్తి చెందే విధంగా సేవలు మెరుగు పడాలని తెలిపారు. మాతృ, శిశు మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణులకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిపించాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పారిశుధ్యంపై నిఘా ఉంచాలని తెలిపారు. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తదితరులు పాల్గొన్నారు.
గోవులను తరలిస్తున్న వాహనం సీజ్
సాలూరు: గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టణ పరిధిలో శుక్రవారం సీజ్ చేసినట్టు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పట్టణ శివారులో వాహన తనిఖీలు చేపట్టగా గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నామని చెప్పారు. 27 గోవులను ఒక లారీలో తరలిస్తుండగా చట్టబద్దమైన పత్రాలు లేకపోవడంతో సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. గోవులను సురక్షిత సంరక్షణ కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు.
జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ
నెల్లిమర్ల రూరల్: చండీఘర్‌లో జరుగుతున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో మండలంలోని గరికిపేట గ్రామానికి చెందిన సీనియర్ వెయిట్‌లిఫ్టర్ బెల్లాన నాని సత్తా చాటింది. 77 కేజీల విభాగంలో శుక్రవారం పోటీల్లో పాల్గొన్న ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
పాచిపెంట: మండలంలోని తంగలాం గ్రామానికి చెందిన గెమ్మెల సురేష్ ఇంటికి విద్యుత్ పనుల నిమిత్తం అరకు వ్యాలీ కందులగుడా గ్రామానికి చెందిన వంతల రాజారావు ఈ నెల 28న వెళ్లాడు. ఈ నెల 29న సురేష్ ఇంటి ముందే రాజారావు మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు సురేష్ సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న రాజారావు కుటుంబ సభ్యులు ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ అర్జున్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు హెచ్‌సీ కృపారావు తెలిపారు.
సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్
సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్


