సంపూర్ణ అభియాన్ 2.0 ప్రారంభోత్సవం
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని కుశ గ్రామంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోనే ఎంతో అందమైన కుశ ప్రాంతంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఈ సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో సంపూర్ణ అభియాన్ పథకం కింద మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ రెడ్డి, ఐటీడీఏ పీఓ జగన్నాథ్, ఐసీడీఎస్ పి.డి కనకదుర్గ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


