మరియగిరి.. భక్తసిరి
● కనుల పండువగా మరియగిరి యాత్ర
● మేరిమాత దర్శనానికి తరలివచ్చిన భక్తులు
● దివ్యపూజల్లో పాల్గొన్న భక్తలోకం
వీరఘట్టం: శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు.. క్రైస్తవుల సహాయమాత మేరీమాత మహోత్సవం శుక్రవారం కనులపండువగా జరిగింది. వీరఘట్టం మండలం యు.వెంకమ్మపేట వద్ద ఉన్న మరియగిరి కొండపై వెలసిన మరియమ్మ దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. టెంకాయలు కొట్టి, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి రాయరాల విజయకుమార్ ఆధ్వర్యంలో సాగిన ప్రత్యేక దివ్యపూజల్లో పాల్గొన్నారు. మేరిమాతకు వందనం.. అభివందనం.. మానవాళికి నీవే తల్లివంటూ కీర్తించారు. ఏసు శాంతి సందేశాలను వినిపించారు. మరియగిరి వద్ద నూతనంగా నిర్మించిన సింహద్వారాన్ని, మేరిమాత విగ్రహాన్ని విజయ్‌కుమార్‌తో కలిసి విశాఖపట్నం బిషప్ ఉడుమల బాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు బిషప్‌లను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చిన సుమారు 50 వేలమంది భక్తులు దివ్యపూజలో పాల్గొన్నారు. మరియగిరి యాత్ర సందర్భంగా వీరఘట్టం, చిట్టపుడివలస, సివిని, పార్వతీపురం, బెలగాం, గరుగుబిల్లి, తూడి, పాలకొండ, వంగర, తలవరం, సంకిలి, నవగాం, పాలవలస తదితర గురుమండలాల్లో ఇటీవల నిర్వహించిన బైబిల్, ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి శ్రీకాకుళం, విశాఖపట్నం బిషప్‌లు బహుమతులు ప్రదానం చేశారు. యాత్రకు ఎలాంటి అంతరాయం కలగకుండా పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో పాలకొండ సీఐ ఎ.ప్రసాదరావు, వీరఘట్టం ఎస్‌ఐ ఎస్.షణ్ముఖరావు, సీతంపేట, దోనుబాయి, చినమేరంగి ఎస్‌ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రయాణికుల సౌకర్యార్ధం పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం డిపోల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపారు.
మేరీమాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కళావతి
మరియగిరి కొండపై వెలసిన మేరీమాతను పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి దర్శించుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలందరినీ చల్లగా చూడు తల్లీ అంటూ ప్రార్థన చేశారు. కొవ్వొత్తులు వెలిగించి, టెంకాయ కొట్టి మొక్క తీర్చుకున్నారు. ఆమెతో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు జంపు కన్నతల్లి, వండువ సర్పంచ్ మిడితాన కళ్యాణి మేరిమాతను దర్శించుకున్నారు.
మరియగిరి.. భక్తసిరి
మరియగిరి.. భక్తసిరి
మరియగిరి.. భక్తసిరి


