రాములోరి రథయాత్ర నేడు
–8లో
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామచంద్రస్వామి రథయాత్ర మహోత్సవం శనివారం కనులపండువగా జరగనుంది. దీనికోసం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా కల్యాణోత్సవం అనంతరం రామతీర్థంలో రథయాత్ర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. శనివారం వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో విశేష హోమాలు జరిపిస్తారు. ఉదయం 8 గంటలకు శ్రీ మద్రామాయణ పారాయణం, వైదిక సదస్యం, తదితర కార్యక్రమాలను జరిపిస్తారు. సాయంత్రం 6 గంటలకు పండిత సదస్సు నిర్వహించి పలువురు వేద పండితులకు సన్మాన మహోత్సవం జరిపిస్తారు. అనంతరం సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి మంగల వాయిద్యాల నడుమ సీతారామచంద్రమూర్తిని ఊరేగింపుగా ఉత్తర రాజగోపురం సమీపంలో ఏర్పాటు చేసిన రథంపై ఆసీనులు చేస్తారు. రథంపై విశేష పూజలు నిర్వహించిన తరువాత రాత్రి 10 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆలయం నుంచి కుమ్మరి ఖానా మీదుగా తిరిగి దేవస్థానం తూర్పు రాజగోపురం వద్దకు స్వామివారి రథాన్ని తీసుకువస్తారు. సమీప గ్రామాలైన జగ్గరాజుపేట, సీతారామునిపేట, గొర్లిపేట గ్రామాలకు చెందిన భక్తులు ఎప్పటిలాగే రథాన్ని ముందుకు నడిపిస్తారు. రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సుమారు 40 మంది పోలీసులతో ఆ శాఖ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఉత్సవ విజయవంతానికి భక్తులు సహకరించాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు.
రాత్రి 10 గంటలకు రథంపై ఊరేగనున్న సీతారామచంద్రస్వామి
ఏర్పాట్లు పూర్తిచేసిన దేవస్థానం
అధికారులు
రాములోరి రథయాత్ర నేడు


