రెవెన్యూ రికార్డుల్లోని తప్పులను సరిదిద్దాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
రాజాం సిటీ: జిల్లాలోని రెవెన్యూ రికార్డుల్లో దొర్లిన తప్పులను సరిదిద్దడంతో పాటు భూ వివాదాలులేని జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. పాలకొండ రోడ్డులోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ హాల్‌లో చీపురుపల్లి డివిజన్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రికార్డుల సవరణ ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలన్నారు. రీసర్వేలో అత్యంత పారదర్శకంగా రికార్డుల ప్రక్షాళన జరగాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వీఆర్వోలు, సర్వేయర్లు సంయుక్తంగా ప్రతి భూమిని పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడి ఈకేవైసీ పూర్తిచేయాలన్నారు. వివరాలన్నీ కచ్చితంగా ఉన్నాయని నిర్దారించుకున్న తరువాతే పాస్‌పుస్తకాలు ప్రింటింగ్‌కు పంపాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న 3,896 పాస్ పుస్తకాలను తక్షణమే సరిదిద్ది 10 రోజుల్లో రైతులకు అందజేయాలని ఆదేశించారు.
జేసీ ఎస్.సేతుమాధవన్ మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకాల్లోని తప్పులను సరిదిద్దడం, సీసీఎల్‌ఏ ఇచ్చిన తాజా ఆదేశాలపై అవగాహనతోపాటు రీసర్వే ప్రక్రియపై కొత్తమార్గదర్శకాలు, సర్వేశాఖ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామని అన్నారు. పాత రికార్డుల్లోని తప్పులను సవరించేందుకు ప్రభుత్వం తాజాగా తహసీల్దార్లు, ఆర్డీఓలకు సుమోటో అధికారాలు కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా రికార్డులు సిద్ధం చేయాలన్నారు. రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీఓ ప్రమీలగాంధీ, సర్వేశాఖ ఏడీ విజయ్‌కుమార్, డివిజన్‌లోని అన్ని మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.


