ముగిసిన భద్రతా మాసోత్సవాలు
● ప్రమాద రహిత డ్రైవర్లకు సత్కారం
విజయనగరం అర్బన్: ఆర్టీసీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహించిన ‘రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026’ శుక్రవారంతో ముగిశాయి. డీపో ప్రాంగణంలో జరిగిన ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ ఏఆర్‌దామోదర్ మాట్లాడుతూ రవాణా నియమాలు పాటించడమే ప్రమాదాల నివారణకు మార్గ మని అన్నారు. ప్రమాద రహితంగా విధులు నర్వహించిన విజయనగరం, ఎస్.కోట డిపో డ్రైవర్లను ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ హెచ్.దివ్య, డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆ డైరీనే కీలకం
విజయనగరం క్రైమ్: విజయనగరం గోకపేటలో నివసిస్తున్న హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు ఇంట్లో రెండో రోజు శుక్రవారం ఏసీబీ డీఎస్పీ రమ్య అధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన డాక్యుమెంట్లు, భూ పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో తనవల్ల లబ్ధిపొందిన అధికారుల ఫోన్‌నంబర్లు, లబ్ధి వివరాలు ఉన్నట్టు సమాచారం. ఎక్కువగా రిజిస్ట్రార్ల పేర్లు, ఫోన్ నంబర్లు ఉన్నట్టు తెలిసింది.


