వైభవంగా కుడారై ఉత్సవం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా కుడారై ఉత్సవాన్ని ఆలయ అర్చకులు ఆదివారం అత్యంత వైభవంగా జరిపించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో విశేష హోమాలు జరిపించారు. ఈ సందర్భంగా 108 కలశాల్లో కుడారై పాయసాన్ని సిద్ధం చేసి స్వామికి నివేదన చేశారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
సెంచూరియన్‌లో ముగిసిన క్రీడా పోటీలు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయంలో ఈ నెల 6 నుంచి నిర్వహించిన అంతర్ విశ్వ విద్యాలయాల క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డీఎన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు అవసరమైన వనరులను సమకూరుస్తున్నామని, ఆసక్తి గల యువత వినియోగించుకోవాలని సూచించారు. అంతర్జాతీయ క్రీడాకారుడు శ్యాం సుందర్ మాట్లాడుతూ శారీరక శ్రమతో అనారోగ్య సమస్యలు దరి చేరవని, క్రీడలతో ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో రాణించిన విజేతలకు బహుమతులు అందజేశారు.
భవనంపైనుంచి జారిపడి వ్యక్తి మృతి
విశాఖపట్నం: ప్రమాదవశాత్తు మూడంతస్తుల భవనం పైనుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన గణేష్ (45) ఎన్‌ఏడీలోని ఓ ప్రైవేట్ మూవర్స్ అండ్ ప్యాకర్స్‌లో పనిచేస్తున్నాడు. ఆయన తరచూ మద్యం తాగుతూ ఉంటాడు. రాత్రివేళ కార్యాలయం ఉన్న భవనం మేడపై నిద్రిస్తుంటాడు. ఈ క్రమంలోనే గణేష్ మద్యం మత్తులో అదుపు తప్పి మేడపై నుంచి కిందపడి మృతి చెందాడని భావిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
ఆర్థికసాయం అందజేత
విజయనగరం క్రైమ్: స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె.నాగమణి అనారోగ్యం బారినపడి చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా అక్కడే చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయారు. దీంతో బాధిత కుటుంబం ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు చూసి ఆమెతో కలిసి పనిచేసిన ఉద్యోగులు చలించిపోయారు. ఎలాగైనా ఆమె కుటుంబానికి సాయం చేయాలని భావించారు. అనుకున్నదే తడవుగా చందాల రూపంలో పోగు చేసిన రూ.1.10 లక్షలను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ చేతులమీదుగా ఆదివారం బాధిత కుటుంబానికి జిల్లా కేంద్రంలో అందజేశారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ ఇ.నరసింహమూర్తి, ఎస్‌ఐలు శిరీష, నరసింహారావు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతిని సంక్రాంతి కానుకగా ప్రభుత్వం ప్రకటించాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్‌టీఏ) రాష్ట్ర కార్యదర్శి చిప్పాడ సూరిబాబు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పీఆర్‌సీ గడువు ముగిసి ఇప్పటికే రెండు సంవత్సరాల ఆరు నెలలు పూర్తయిందని, నూతన పీఆర్‌సీ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం కనీసం పీఆర్‌సీ కమిషన్‌ను నియమించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఎన్నికల హామీతో పాటు ఇటీవల ఉద్యోగ సంఘాలకు సీఎం ఇచ్చిన మధ్యంతర భృతి హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఆ హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలుగా సంక్రాంతి కానుకగా పీఆర్‌సీ కమిషన్‌ను నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఐఈఆర్‌పీ టీచర్లకు పూర్తి స్థాయి పే స్కేల్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన నాలుగు ఐచ్ఛిక సెలవులను వ్యక్తిగతంగా కాకుండా గతంలో మాదిరిగా పాఠశాల మొత్తానికి వర్తించేలా పునరాలోచించాలని అధికారులను కోరారు.
వైభవంగా కుడారై ఉత్సవం
వైభవంగా కుడారై ఉత్సవం


