ఘనంగా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ యువ సమ్మేళనం
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని కుక్కిడి జంక్షన్ వద్ద ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన ప్రారంభించిన ఆదివాసీ సంస్కృతి–సంప్రదాయ యువ సమ్మేళనం ఘనంగా జరుగుతోంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలు, అరకు ప్రాంతం నుంచి వచ్చిన గిరిజనులు పెద్దసంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆదివాసీలు వాడిన వస్తుప్రదర్శన, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆర్ట్స్ సంస్థ డైరెక్టర్ ఎన్.సన్యాసిరావు మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి–సంప్రదాయాలను భావితరాలకు అందించే బా ధ్యత యువతపై ఉందని, యువతను ఉత్తేజపర్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
గిరిజన వారసత్వాన్ని భావితరాలకు అందించాలి
గుమ్మలక్ష్మీపురం: గిరిజన సంస్కృతి సంప్రదాయాలు దేశానికే గర్వకారణమని..గిరిజన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు గుమ్మలక్ష్మీపురం మండలంలోని కుక్కిడి జంక్షన్ వద్ద ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న‘ఆదివాసీ సంస్కృతి–సంప్రదాయ యువ సమ్మేళనం’ కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలలు, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ..గిరిజన సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, వారి విశిష్టమైన జీవనశైలి ప్రకృతితో ముడిపడి ఉన్నాయని, అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ వారసత్వాన్ని గిరిజన యువత భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో పండే చిరుధాన్యాలు, ఆకు, కూరగాయలు అత్యంత బలవర్థకమైన ఆహారమని, వాటిని కేవలం విక్రయించడమే కాకుండా గిరిజనులు తమ సొంత ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచించారు. విదేశీ పర్యాటకులు సైతం మన్యం ప్రాంతాన్ని సందర్శించేలా అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, విదేశీ పర్యాటకులు గిరిజన గ్రామాలను సందర్శించేలా గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ సంస్థ డైరెక్టర్ నూక సన్యాసిరావు, గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ యువత పాల్గొన్నారు.
ఘనంగా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ యువ సమ్మేళనం


