చి‘వరి’లో తెగుళ్ల దాడి
విజయనగరం ఫోర్ట్: వరి పంట చివరి దశకు వచ్చింది. 10 నుంచి 15 రోజుల్లో పంట కోతకు వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో సంభవించిన మోంథా తుఫాన్ వరి పంటను నిలువునా ముంచేసింది. రైతన్నను కోలుకోని దెబ్బతీసింది. మోంథా వర్షాల ప్రభావంతో ఇప్పుడు వరి పంటను తెగుళ్లు అశించాయి. వాటి నివారణకు మళ్లీ పెట్టుబడి పెట్టాల్సి రావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటకే పంట సాగుకు వేలల్లో పెట్టుబడి పెట్టాం.. అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేసి జల్లాం.. ఇప్పుడు మళ్లీ తెగుళ్ల నివారణకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఆకుముడత, పొడ తెగులు, బ్యాక్టీరియా తెగుళ్ల నివారణకు ఎకరానికి రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు మళ్లీ పురుగు నివారణ మందుల పిచికారీ కోసం స్పెయిర్‌లు పట్టుకుని పొలంబాట పట్టారు.
జిల్లాలో 1.04 హెక్టార్లలో సాగు..
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి పంట 1.04 లక్షల హెక్టార్లలో సాగైంది. తర్వాత స్థానాల్లో మొక్కజొన్న, చెరకు, వేరుశనగ, అపరాలు, గోగు, నువ్వు పంటలు ఉన్నాయి. వరి పంటకు మానుపండు తెగులు, మెడవిరుపు తెగులు, సుడిదోమ తెగులు అశించాయి. మోంథా తుఫాన్ వల్ల నీరు ఎక్కువ రోజులు పొలాల్లో నిల్వ ఉండడం వల్ల ఈ తెగుళ్లు ఆశించాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పొలాల్లో ఉన్న నీటిని బయటకు తీసేయడంతో పాటు తెగులు నివారణకు అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పురుగు మందులను పిచికారీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోతే పంటదిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రూ.వేలల్లో పెట్టుబడి...
వరి పంటసాగుకు రైతులు ఇప్పటికే రూ.వేలల్లో పెట్టుబడి పెట్టారు. వరి విత్తనాలు కొనుగోలు దగ్గర నుంచి విత్తేందుకు, నారు తీసేందుకు, దమ్ముచేసి నాట్లు వేసేందుకు, కలుపు నివారణ, ఎరువులు, తెగుళ్ల నివారణకు ఎకరానికి రూ.20 వేలు నుంచి రూ.30 వేలు వరకు ఖర్చుచేశారు. ఇప్పుడు తెగుళ్లు ఆశించడం వల్ల మళ్లీ రూ.వేలల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పంట చివరి దశలో తెగుళ్లు సోకడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు.
తెగుళ్లు నివారణే ప్రధానం
వరి పంటకు కొన్ని చోట్ల మానుపండు తెగులు, సుడిదోమ ఆశించింది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల ప్రకారం తెగులు నివారణకు చర్యలు తీసుకోవాలి.
– వి.తారకరామారావు,
జిల్లా వ్యవసాయ అధికారి
ఆందోళనలో రైతన్న
వరిని ఆశించిన మానుపండు
తెగులు, సుడిదోమ
ఇప్పటికే వేలల్లో పంటకు పెట్టుబడి పెట్టిన రైతులు
తెగుళ్ల నివారణకు
పెట్టుబడి తడిసిమోపెడు
చి‘వరి’లో తెగుళ్ల దాడి
చి‘వరి’లో తెగుళ్ల దాడి


