పాత నేరస్తులపై నిఘా పెట్టండి
● ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైమ్: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పోలీస్ అధికారులకు సూచించారు. కేసుల నమోదు, చార్జిషీట్‌ల దాఖలు, పెండింగ్ కేసుల పరిష్కారంపై దిశా నిర్దేశం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను అరెస్టు చేసే సమయంలో వారి కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా, ఫొటోలు, వేలి ముద్రలు, స్నేహితుల వివరాలను సేకరించి రికార్డుల్లో భద్రపరచాలన్నారు. హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులు, పాత నేరస్తుల ప్రస్తుత జీవన విధానాన్ని గమనిస్తుండాలని, వారికి కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో వారి ప్రవర్తన తీరును గమనించాలన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై, దర్యాప్తులో ఉన్న చోరీ కేసులపై ఎస్పీ ప్రత్యేకంగా సమీక్షించి, ఆయా కేసుల్లో పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేసి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేవారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. గంజాయి, సారా రవాణాను కట్టడి చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, జి.భవ్య రెడ్డి, ఎన్.రాఘవులు, సీఐలు లీలా రావు, ఆర్వీకే చౌదరి, శ్రీనివాస్,, లక్ష్మణరావు పలువురు సీఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో ఎస్‌ఐలు హాజరయ్యారు.
విమానాశ్రయం పనుల పరిశీలన
భోగాపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర విమాయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు మంగళవారం పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 27 శాతం మేర నిర్మాణ పనులు పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం 91.7 శాతం పనులు పూర్తయ్యాయని, జనవరిలో ఇక్కడ నుంచి విమానరాకపోకలను పరీక్షిస్తామన్నారు. వచ్చే ఏడాది జూన్ 20వ తేదీ నాటికి నిర్మాణ పనులను పూర్తిచేయాలని సీఎం సీఎం చంద్రబాబు సూచనలు ఇచ్చారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఐదు స్టార్ హోటల్స్‌తో పాటు ఇండిగో హబ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. భోగాపురం విమానాశ్రయంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబిస్తున్నామని, ప్రపంచాన్ని జయించే శక్తి ఉంత్తరాంధ్రలో ఉందని తెలిపారు. కార్యక్రమంలోఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, కలెక్టర్ రామ్‌సుందర్‌రెడ్డి, ఏస్పీ దామోదర్, ఆర్డీఓ దాట్ల కీర్తి, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
పాత నేరస్తులపై నిఘా పెట్టండి


