నరికేసిన తమ్ముళ్లు
పామాయిల్, అరటి తోటలను
● ‘మా పార్టీ అధికారంలో ఉంది.. దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ హూంకరింపు
● గగ్గోలు పెడుతున్న బాధిత రైతు
కొమరాడ:
తెలుగు తమ్ముళ్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అధికార బలంతో చెలరేగిపోతున్నారు. పచ్చని తోటలను తెగ నరుకుతూ ప్రత్యర్థులకు ఆస్తినష్టం కలిగిస్తున్నారు. దీనికి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కొరిశీల గ్రామంలో జరిగిన ఘటనే నిలువెత్తు సాక్ష్యం. గ్రామానికి చెందిన బడే సుందర పాత్రుడు, బడే సరోజినమ్మకు చెందిన ఎకరం పైబడి విస్తీర్ణంలోని పామాయిల్, అరటి తోటలను అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు బడే విజయ, బడే పకీరుపాత్రుడు, బడే ప్రవీణ, గుణాపు భాస్కరరావు, మరో ముగ్గురు కూలీలతో కలిసి ఈనెల 1న ధ్వంసం చేశారు. ‘పొలం వద్దకు వస్తే మిమ్మల్ని కూడా నరుకుతాం.. మా పార్టీ అధికారంలో ఉంది.. ఏం చేస్తారో చేసుకోండి.. దిక్కున్నచోట చెప్పకోండి’ అంటూ భయాందోళనకు గురిచేశారని బాధిత రైతు వాపోయారు. అదే రోజు గ్రామానికి వెళ్లి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశామని, వారంతా పొలం వద్దకు వచ్చి సర్దిచెప్పినా వినకుండా తోటలను నరికేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతిలేక పోలీసులకు ఈనెల 3న ఫిర్యాదు చేశామన్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
నరికేసిన తమ్ముళ్లు
నరికేసిన తమ్ముళ్లు


