ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలి
● జేసీ సేతుమాధవన్
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం సిద్ధం కావాలని జేసీ సేతుమాధవన్ ఆదేశించారు. ధాన్యం సేకరణపై సిబ్బందికి కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు సాధారణ రకం రూ.2,369, గ్రేడ్–ఏ రకం రూ.2,389గా ఉంటుందని తెలిపారు. ధాన్యం సేకరణకు జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు, 261 క్లస్టర్లను ఏబీసీలుగా వర్గీకరించామని చెప్పారు. జిల్లాలో కోటి గోనె సంచులు అవసరం కాగా 50 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన వాటిని సేకరించాల్సి ఉంటుందన్నారు. 2 వేల వరకు వాహనాలను సిద్ధం చేశామని చెప్పారు. ఈ వాహనాలన్నీ జీపీఎస్ పద్ధతిలో పనిచేస్తాయని తెలిపారు. 159 మిల్లులను గుర్తించామన్నారు. వాటి సామర్‌ాధ్యన్ని బట్టి ధాన్యం సిద్ధంచేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గ్రామాల్లో ప్రతీరైతుకు ధాన్యం సేకరణపై అవగా హన కల్పించాలన్నారు. నిర్లక్ష్యంగా పనిచేసే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. చెల్లింపులు 48 గంటలలోగా పూర్తియ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ 89789 75284 ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మేనేజర్ బి.శాంతి, ఆర్డీఓలు కీర్తి, రామ్మెహన్, సత్యవాణి, డీఎస్‌ఓ జి.మురళీనాథ్, జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు.


