కూటమి కుట్రలు తిప్పికొడదాం
● వైద్యకళాశాలల ప్రైవేటీకరణను
అడ్డుకుందాం
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రజారోగ్యం– ప్రజల హక్కు, పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సూపర్‌స్పెషాలిటీ వైద్యం, వారి పిల్లలకు వైద్యవిద్యను అందించాలనే ఆలోచనతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకురాగా.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రవేటీకరణ చేసేలా కుట్ర పన్నుతోందని వైస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. కూటమి కుట్రను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు నిసనగా గరివిడి మండలంలోని ఏనుగువలస, బాగువలస, కొండదాడి, వెదుళ్లవలస గ్రామాల్లో మంగళవారం కోటిసంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వెదుళ్లవలస గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో విద్య, వైద్యం ప్రజలకు దూరమైందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందన్నారు. తుఫాన్ కారణంగా పంటలను నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పంటలను కొనుగోలుచేసేవారు కరువయ్యారని వాపోయారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, వైస్ ఎంపీపీ జి.శ్రీరాములనాయుడు, ఆయా పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు.
కూటమి కుట్రలు తిప్పికొడదాం


