వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు ప్రారంభం

May 20 2024 12:45 AM | Updated on May 20 2024 12:45 AM

వేణుగ

వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు ప్రారంభం

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు ఆదివారం రాత్రి నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఉపాలయంలో కొలువుదీరిన వేణుగోపాలస్వామి సన్నిధిలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంబం వద్ద గరుత్మంతుడు చిత్రపటం ఎగురవేసి, ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాలను విజయవంతం చేయాలని సమస్త దేవతామూర్తులకు ఆహ్వానం పలికారు. ఐదు రోజుల పాటు స్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపిస్తామని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు నరసింహాచార్యులు, సాయిరామాచార్యులు, కిరణ్‌, రామగోపాల్‌, భక్తులు పాల్గొన్నారు.

ఎస్‌బీఐ సేవా కేంద్రంలో చోరీ

రామభద్రపురం: మండల కేంద్రంలో గల ఎస్‌బీఐ సేవా కేంద్రంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరికతోటకు చెందిన పట్నాయకుని సత్యారావు ఐదేళ్లుగా ఎస్‌బీఐ సేవా కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఈయన శనివారం మధ్యాహ్నం సేవా కేంద్రాన్ని మూసి ఇంటికి భోజనానికి వెళ్లాడు. వినియోగదారులు లేకపోవడంతో రెండో పూట కేంద్రాన్ని తెరవలేదు. ఆదివారం ఉదయం కేంద్రం తెరిచి చూడగా.. సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ల్యాప్‌ట్యాప్‌, రూ. 1.66 లక్షల నగదు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై జ్ఞానేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయ్యో ‘పాప’ం

పార్వతీపురం టౌన్‌: ఏ తల్లికి ఏ కష్టం వచ్చిందో గాని ఆ చిన్నారికి నూరేళ్లు నిండాయి. పొత్తిళ్లలో సేద తీరాల్సిన పసికందు పంట కాలువలో విగతజీవిగా కనిపించిన తీరు చూపరులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే.... పార్వతీపురం పట్టణానికి ఆనుకుని కొత్తవలస వద్ద ఉన్న జంఝావతి పంట కాలువలో ఆదివారం ఉదయం పసికందు మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన చూసి స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆడ శిశువుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పార్వతీపురం పట్టణ సీఐ కృష్ణారావు తెలిపారు.

గాయపడిన యువకుడి మృతి

సీతంపేట: కొద్ది రోజుల కిందట అడ్డాకులగూడ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో గాయపడిన సిరికొండ గ్రామానికి చెందిన కొండగొర్రి సునీల్‌కుమార్‌ (20) శనివారం రాత్రి మృతి చెందాడు. ఏఎస్సై సంజీవ్‌ తెలియజేసిన వివరాలకు మేరకు.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సునీల్‌కుమార్‌ను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సునీల్‌కుమార్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

బొబ్బిలి: మండలంలోని మెట్టవలస, గొర్లె సీతారామపురం మధ్య ఉన్న చెరువు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఇందిరమ్మ కాలనీకి చెందిన ఎ.వెంకటేష్‌ బైక్‌ మీద రామభద్రపురం వైపు వెళ్తున్నాడు. ఇదే సమయంలో విజయనగరం నుంచి బొబ్బిలి వస్తున్న టాటా ఏస్‌ వాహనం ఇతడ్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్‌కు తీవ్ర గాయాలు కాగా, వ్యాన్‌లో ఉన్న బొబ్బిలికి చెందిన గుర్నాథరావుకు కూడా గాయాలయ్యాయి. వీరిద్దరినీ బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు ప్రారంభం 1
1/3

వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు ప్రారంభం

వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు ప్రారంభం 2
2/3

వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు ప్రారంభం

వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు ప్రారంభం 3
3/3

వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement