ఆదివాసీ బిడ్డల ఆత్మఘోష పాలకులకు వినిపించడం లేదా? మారికవలస గురుకులం తరలింపుపై మిన్నంటిన ఆగ్రహం పాఠశాల గేటు ఎదుట ఉదయం నుంచి రాత్రి వరకు భారీ ధర్నా వైఎస్సార్‌సీపీ, గిరిజన, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన రాత్రి గేటు ఎదుటే పడుకొని నిరసన కొనసాగింపు
మధురవాడ: ఆదివాసీ బిడ్డల ఆవేదన, ఆత్మఘోష ప్రభుత్వానికి వినిపించడం లేదా? మారికవలస గిరిజన గురుకుల ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ఇక్కడే కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళన విరమించేది లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తేల్చిచెప్పారు. పాఠశాలను తరలించడంపై సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన ఆందోళనతో మారికవలసలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిరుజల్లులు కురుస్తున్నా లెక్కచేయకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, గిరిజన, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు పాఠశాల ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాత్రి కూడా అక్కడే పడుకొని ఆందోళన కొనసాగించారు. చంద్రబాబు పర్యటనకు ముందు రోజు మారికవలస బాలుర ఇంగ్లిష్ మీడియం పాఠశాలను అక్కడే కొనసాగిస్తామని, ఇతర ప్రాంతాలకు తల్లిదండ్రుల అనుమతి లేకుండా తరలించిన విద్యార్థులను తిరిగి తీసుకొస్తామని ఐటీడీఏ పీవో, ఎస్పీ హామీ ఇచ్చి.. మాట తప్పారని ఆరోపించారు. పాడేరు నుంచి పాఠశాలకు తీసుకొచ్చిన 37 మంది విద్యార్థులను ఇక్కడ అనాథల్లా వదిలేశారని, ఇతర ప్రాంతాలకు తరలించిన తమ పిల్లల పరిస్థితి, ఆచూకీ కూడా తెలియడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను కలిసేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం, గిరిజన సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. గురుకుల కార్యదర్శితో చర్చలకు రావాలని భీమిలి ఆర్‌డీవో సంగీత్‌మాధుర్, ఏసీపీలు అప్పలరాజు, వెంకటరావు ఆహ్వానించినా ఆందోళనకారులు అంగీకరించలేదు. గతంలో ఇచ్చిన హామీనే అమలు చేయలేదని, మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అధికారులే గేటు వద్దకు వచ్చి తమతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. విద్యా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.
మురుగునీరు మళ్లించారు?
ఆందోళన కొనసాగుతున్న సమయంలో తమను రెచ్చగొట్టేలా అధికారులు వ్యవహరించారని నాయకులు ఆరోపించారు. ఆందోళనకారులు కూర్చున్న పాఠశాల గేటు వైపు టాయిలెట్ల నుంచి మురుగునీటిని మళ్లించారని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కవ్వింపు చర్యేనని మండిపడ్డారు. అలాగే రాత్రి గేటు బయట పడుకునేందుకు దుప్పట్లు, చాపలు, ఇతర సామగ్రిని తీసుకొస్తున్న వాహనాన్ని పీఎం పాలెం పోలీసులు స్టేషన్‌కు తరలించారని పేర్కొన్నారు.
జీవో 69 రద్దు చేయాలి
మారికవలస గురుకుల పాఠశాల తరలింపునకు కారణమైన 69వ నంబర్ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా విద్యార్థులను బలవంతంగా తరలించి వారి హక్కులకు భంగం కలిగించిన గురుకుల అధికారులు, ఇతర బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జీవీఎంసీ ఫ్లోర్ మాజీ లీడర్ డాక్టర్ బి.గంగారావు, కాంగ్రెస్ అరకు ఇన్‌చార్జి గంగాధర్ స్వామి తదితరులు ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, జీసీసీ మాజీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు సుబ్రహ్మణ్యం, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తెడబారికి సురేష్‌కుమార్, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ రాజేశ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అజయ్, ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి నేత పి.ప్రగతి పాల్గొన్నారు.
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
విద్యార్థులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించలేదు. చేతకాకపోతే మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. సీఓఈకి స్థలాలు చాలా ఉన్నాయి. 90 పైసలకే స్థలాలు ఇచ్చేస్తున్నారు. అలాంటప్పుడు గిరిజన విద్యార్థుల హాస్టల్‌కు స్థలం లేదా? – పి.ప్రగతి, ఆంధ్రా యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ నేత
పాఠశాలను ఎలా మూసేస్తారు?
పీపీపీ ఒప్పందంతో నడుస్తున్న పాఠశాలను మూసివేసి ఇప్పుడు మళ్లీ విద్యార్థులను వెనక్కి తీసుకొస్తామంటున్నారు. ఇప్పటికే పిల్లల మనసులను గాయపరిచారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వెంటనే స్పందించాలి. బాలికల పాఠశాలలోకి బాలురను ఎలా పంపిస్తారు? –కె.విజయగౌరి, పీడీఎఫ్ నేత


