అధికారులకు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ హెచ్చరిక
మహారాణిపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ‘సర్’ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. తక్కువ పురోగతి సాధించిన ఏఈఆర్వోలతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడి కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తక్కువ పురోగతి సాధించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని కలెక్టరే దగ్గరుండి పర్యవేక్షించాలనే భావన నుంచి అధికారులు బయటకు రావాలని, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు బాధ్యత తీసుకుని ప్రక్రియకు నాయకత్వం వహించాలని స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు వచ్చిన ఫారం–6తో పాటు ఫారం–7 దరఖాస్తుల తాజా పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అక్టోబర్ 3న తుది ముసాయిదా జాబితా ప్రచురించే వరకు ఎవరూ విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


