సింహాచలం: ఈ నెల 11న శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని సింహగిరిపై ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్టు ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. సింహగిరిపై ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక కల్యాణోత్సవ ప్రాంగణంలో ఉదయం 8గంటల నుంచి వ్రతాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. వ్రతాల్లో పాల్గొనే మహిళలందరికీ దేవస్థానమే పూజాసామగ్రి ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. కొండ పైకి, దిగువకు దేవస్థానం బస్సుల్లో ఉచిత రవాణా కల్పిస్తామన్నారు. వ్రతాల్లో పాల్గొనే మహిళలు ఈ నెల 5నుంచి 9వ తేదీలోపు సింహగిరిపై ఉన్న పీఆర్వో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.


