ఎస్‌ అంటేనే పాస్‌! | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ అంటేనే పాస్‌!

Sep 1 2026 3:06 AM | Updated on Sep 1 2026 3:06 AM

● ఏయూలో పెత్తందారీ పోకడలు ● అకారణంగా ఫెయిల్‌ చేస్తున్నారంటూ విద్యార్థుల ఆందోళన ● ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన దళిత విద్యార్థి ● విచారణకు వీసీని ఆదేశించిన కమిషన్‌

విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీ విద్యా విధానంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బలవంతంగా ఫీజుల వసూళ్లు.. హాస్టల్‌ మెస్‌లలో పురుగుల భోజనాలు.. ఆస్పత్రిలో వసతుల లేమి.. ఇలా వరుస వివాదాలు చుట్టుముట్టిన సమయంలో తాజాగా మరో అంశం ఏయూలో కలకలం రేపుతోంది. ఏయూలో పెత్తందారీ పోకడలతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. పలు విభాగాల్లో కొందరు అధ్యాపకుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోంది. తమ మాటకు ఎదురుచెప్పినా, అడుగులకు మడుగులొత్తకపోయినా విద్యార్థులపై కక్షగట్టి ప్రాక్టికల్స్‌లో ఫెయిల్‌ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో ఒక దళిత విద్యార్థిని అకారణంగా ఫెయిల్‌ చేసిన వైనం ఎస్సీ కమిషన్‌కు చేరడంతో వర్సిటీలో పరీక్షల నిర్వహణ లోపభూయిష్టంగా సాగుతోందనే విమర్శలు బలపడుతున్నాయి.

ప్రశ్నించినందుకే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్‌?

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో ఎంపీఈడీ చదువుతున్న కె.ఏసుబాబు అనే దళిత విద్యార్థికి ప్రాక్టికల్స్‌లో అన్యాయం జరిగిందని బాధితుడు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించాడు. గతంలో వర్సిటీలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రైవేటు కళాశాలల వారికి కాకుండా ఏయూ విద్యార్థులకే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేయడమే తాను చేసిన నేరమైందని ఏసుబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతూ అన్ని పోటీల్లో పాల్గొన్న తనను కావాలనే ఫెయిల్‌ చేశారని, అసలు తరగతులకే రానివారిని ఉత్తీర్ణులను చేశారని ఫిర్యాదులో ఆరోపించాడు. విభాగంలోని టీచర్‌ డైరీ, హ్యాండ్‌బుక్‌ పరిశీలిస్తే తరగతుల నిర్వహణలోని డొల్లతనం, తనకు జరిగిన అన్యాయం బయటపడతాయని చెబుతున్నాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ బాధితుడికి న్యాయం చేయాలని వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య జీపీ రాజశేఖర్‌ను ఆదేశించారు. దీనిపై వీసీ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ నేతృత్వంలో అంతర్గత విచారణ ప్రారంభమైంది.

వివాదాల నిలయంగా మారిన విభాగం

ఏయూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం తరచూ అక్రమాలు, వివాదాలకు కేంద్రంగా మారుతోందని విద్యార్థి వర్గాలు మండిపడుతున్నాయి. గతంలో పలు విభాగాల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మహిళా ప్రొఫెసర్‌కు ఇక్కడ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్లే పరిస్థితులు దిగజారాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఎస్సీ కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు ఫిజికల్‌ డైరెక్టర్‌ విజయ్‌ మోహన్‌ పేరును సైతం ప్రస్తావించగా, ఆయన పదవీ విరమణ పొందడంతో విచారణ ఎంతవరకు నిష్పక్షపాతంగా సాగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్లక్ష్యం రాజ్యమేలుతున్న ఈ విభాగంలో పేద విద్యార్థులకు న్యాయం జరగాలంటే వర్సిటీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement