ఉమ్మడి జిల్లాలోని పోలీసుల అత్యుత్సాహమో... అధికారపార్టీ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్ల వల్లనో... పూర్తిగా విచారణ చేయకుండానే జరిగిన సంఘటనలపై నిర్ధారణకు వచ్చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా కేసులను కూడా అదే తరహాలో నమోదు చేస్తున్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసుల వ్యవహారశైలితో బాధిత కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఇటీవల సంచలనం సృష్టించిన గాజువాకలో జరిగిన మౌనిక హత్య కేసులో ఏకపక్షంగా హంతకుడు నేవీ అధికారి చింతాడ రవీంద్ర చెప్పిన విషయాన్నే యథాతథంగా అదే వివరాలను పోలీసులు వెంటనే ప్రకటించారు. విచారణలో మాత్రం హత్య వేరే ప్రాంతంలో జరిగినట్టు గుర్తించారు. ఈ ఘటనలో విశాఖ పోలీసులు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ ఘటన మరువకముందే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగిన ఒక వ్యక్తి మరణంపై యాక్సిడెంట్ అంటూ స్థానిక పోలీసులు ప్రకటించడం అనుమానాలకు దారి తీసింది. కనీసం పోస్టుమార్టం నివేదిక ఇంకా అందకముందే ఎందుకు అంత త్వరగా పోలీసులు ప్రకటనలు గుప్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామ సమీపంలో యువకుడు లాలం సాయికుమార్ అనుమానాస్పద మృతిపై యాక్సిడెంట్ అంటూ పోలీసులు ప్రకటించడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో అటు మౌనిక, ఇటు సాయికుమార్ హత్య, అనుమానాస్పద మృతిపై సదరు బాధిత కుటుంబ సభ్యులు విచారణ చేయాలంటూ ఇటు పోలీసు కమిషనర్‌ను, అటు అనకాపల్లి జిల్లా ఎస్పీని కలిసి విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ విధంగా హడావుడిగా జరిగిన సంఘటనలపై ప్రకటనలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
అది యాక్సిడెంట్ కాదు...!
ఇప్పటికే గాజువాకలో జరిగిన మౌనిక హత్య కేసులో మరోసారి విచారించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నా నిందితుడు చెప్పిన వివరాలనే పోలీసులు ఎలా చెబుతారంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పోలీసులు లోతుగా విచారణ జరపకుండానే వివరాలను పత్రికా ముఖంగా బహిరంగంగా ప్రకటించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు కలెక్టర్‌తో పాటు పోలీసు కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశా రు. ఈ పరిస్థితుల్లో తాజాగా అనకాపల్లి జిల్లాలో నూ ఇదే తరహా సంఘటన జరగడం పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామ సమీపంలోని నెల్లిమెట్ల వద్ద ఈ నెల 9వ తేదీన లాలం సాయికుమార్ (30) అనే యువకుడు అనుమానాస్పదంగా మరణించాడు. బైక్‌పై నర్సీపట్నం వెళుతుండగా యాక్సిడెంట్ జరిగిందంటూ పోలీసులు ప్రకటించారు. అయితే, సంఘటన జరిగిన ప్రదేశాన్ని గమనించిన కుటుంబ సభ్యులు మాత్రం మృతి అనుమానాస్పదంగా ఉందని అంటున్నారు. యాక్సిడెంట్ జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నా, పరిసరాలను గమనిస్తే హత్యే కావొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అనకాపల్లి జిల్లా ఎస్పీని కలిసేందుకు గురువారం కార్యాలయానికి వచ్చి విచారణ చేయాలంటూ విన్నవించారు. అయితే, ఎస్పీని కలిసేందుకు సైతం కార్యాలయంలోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉదయం 11 గంటల నుంచి సాయంతం 5 గంటల వరకూ వారు వేచి ఉండాల్సి వచ్చింది. సాయంత్రం 5.15 గంటల సమయంలో ఎస్పీ తుహిన్ సిన్హా కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా మృతుడి భార్య లాలం రాజ్యలక్ష్మి తమ గోడును వినిపించుకుంది. దీంతో ఆయన స్పందించి కేసులో పూర్తి విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణికి ఈ కేసు విచారణ బాధ్యతలు అప్పగించారు.
హత్య చేసి యాక్సిడెంట్ అంటున్నారు...!
తన భర్త లాలం సాయికుమార్‌ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారంటూ మృతుడు లాలం సాయికుమార్ భార్య రాజ్యలక్ష్మి వాపోతున్నారు. మా కుటుంబానికి న్యాయం చేయాలని గురువారం అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హాను కలిసి విన్నవించారు. రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామంలో ఈనెల 9వ తేదీన తన భర్త లాలం సాయికుమార్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకారం హత్యచేశారనేది ఆమె ఆరోపణ. సంఘటన జరిగి నాలుగు రోజులైనప్పటికీ పోస్టుమార్టం నివేదిక ఎందుకు రాలేదని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ఒక్కోసారి ఒక విధంగా తమకు సమాచారం ఇచ్చారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పోలీసులు వ్యవహారశైలి మరోసారి ఉమ్మడి విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అత్యుత్సాహమా!.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లా?
పూర్తిగా విచారణ చేయకుండానే
కేసుల నిర్ధారణ
బాధిత కుటుంబాల నుంచి విమర్శలు
మళ్లీ విచారణ చేయాలంటూ నివేదనలు
గతంలో గాజువాకలో మౌనిక
ఇప్పుడు నర్సీపట్నంలో లాలం సాయి మృతిపై అదే తీరు
నా భర్తను హత్య చేశారు
ఈ నెల 9న ఉదయం 11 గంటలకు నా భర్త లాలం సాయికుమార్‌కు గాలి రాజేష్, సుర్ల సతీష్ ఫోన్ చేసి రమ్మన్నారు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి మాకిరెడ్డి నానాజీతో కలిసి మద్యం సేవించారు. అదేరోజు సుమారుగా సాయంత్రం 5.30 సమయంలో నా భర్త లాలం సాయికుమార్ మృతిచెందినట్టు తమకు పోలీసులు నుంచి ఫోన్ వచ్చింది. ఎలా మృతి చెందాడని అడగగా..బైక్‌ను కారు ఢీ కొట్టిందని ఒకసారి, బైక్ చెట్టును ఢీ కొట్టిందని మరోసారి, మూడోసారి సెల్ఫ్ యాక్సిడెంట్ అయిందని పొంతన లేని సమాధానం చెప్పారు. నా భర్త ఎలా మృతిచెందాడో పూర్తి సమాచారం ఇవ్వాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశాను.
– రాజ్యలక్ష్మి, మృతుడు సాయికుమార్ భార్య
మృతికి కారణాలను వెలికితీయాలి
నా మేనల్లుడు ఎలా మృతిచెందాడో ఇప్పటికీ అనుమానంగానే ఉంది. యాక్సిడెంట్ జరిగితే మృతుడి శరీరంపై గాయాలు ఉంటాయి, కానీ ఎక్కడా గాయాలు కనిపించలేదు. కాలిపై మాత్రమే చిన్న రక్కులా ఉంది. ఈ విషయంపై ఎస్పీ తుహిన్ సిన్హాకు లిఖిత పూర్వకంగా వినతిప్రతం అందజేశాం. మూడు రోజుల్లో కేసును ఛేదించడం జరుగుతుందని చెప్పారు.
–నాగరాజు, మృతుడి మేనమామ, బుచ్చింపేట గ్రామం


