‘చినబాబు’ చేతికి
అమరావతి నుంచే టెండర్ల ‘రింగ్’.. అంతా గంపగుత్తగా అప్పగింత!
గతంలోనూ
ఇదే తరహా దోపిడీ
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో (2014–2019) కూడా ఇదే తరహాలో ఏయూ ఇంజనీరింగ్ విభాగాన్ని పక్కనబెట్టి దోపిడీకి తెరలేపారు. అప్పట్లో వర్సిటీ పనులన్నింటినీ ఏపీఈడబ్ల్యూఐడీసీ ద్వారానే టెండర్లు పిలిచారు. ఆ సమయంలో కాంట్రాక్ట్ సంస్థలు సిండికేట్‌గా ఏర్పడి, అంచనా విలువల కంటే 6 నుంచి 8 శాతం అదనపు ధరలను కోట్ చేసి పనులు దక్కించుకున్నాయి. దీనికి తోడు, ఈ టెండర్ల వ్యవహారాన్ని పర్యవేక్షించినందుకు గానూ ఏపీఈడబ్ల్యూఐడీసీ సంస్థకు ఏయూ అదనంగా 6 శాతం కన్సల్టెన్సీ ఫీజు చెల్లించాల్సి వచ్చింది. అంటే అప్పట్లోనే వర్సిటీపై 12 నుంచి 14 శాతం అదనపు భారం పడింది. సాధారణంగా ఏయూ ఇంజనీరింగ్ విభాగం నేరుగా టెండర్లు పిలిస్తే.. పోటీ కారణంగా కాంట్రాక్టర్లు ప్రస్తుతం ఉన్న టెండర్ ధర కంటే కనీసం 4 శాతం తక్కువ ధరకే పనులు దక్కించుకుంటారు. కానీ ఏపీఈడబ్ల్యూఐడీసీ మార్గంలో వెళ్లడం వల్ల ఆ 4 శాతం ఆదా కాకపోగా, అదనపు ఖర్చులన్నీ కలిపి ఏయూ ఖజానాపై ఏకంగా 16 నుంచి 18 శాతం వరకు అదనపు భారం పడుతుందని వర్సిటీ అధికారులు లెక్కలతో సహా గుర్తుచేస్తున్నారు. ఈ సంస్థ ద్వారా పిలిచే టెండర్లలో కొద్దిమంది మాత్రమే ‘రింగ్’గా ఏర్పడి పనులు దక్కించుకుంటారని, ఫలితంగా పనులన్నీ నాసిరకంగా మారుతాయనే ఆరోపణలు ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
ఇప్పటికే అమరావతి కోసం ఆంధ్రా యూనివర్సిటీ నుంచి రూ.300 కోట్ల నిధులను మళ్లించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా వర్సిటీ స్వయంప్రతిపత్తిని, దాని ఇంజనీరింగ్ విభాగాన్ని దెబ్బతీసేందుకు వ్యూహం రచించింది. వర్సిటీలో జరిగే అభివృద్ధి, నిర్మాణ పనులన్నింటినీ అమరావతి నుంచే పర్యవేక్షించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా బ్రిటీష్ కాలం నాటి ఘనచరిత్ర కలిగిన ఏయూ సొంత ఇంజనీరింగ్ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, సుప్తచేతనావస్థలోకి నెట్టేసేందుకు పావులు కదుపుతోంది. ఇకపై ఏయూలో చేపట్టబోయే పనులన్నింటికీ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఈడబ్ల్యూఐడీసీ) ద్వారానే టెండర్లు పిలిచి, పనులను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, వర్సిటీ పనులన్నీ ఇకపై ‘చినబాబు’ చేతుల్లోకి వెళ్లనున్నాయన్నమాట. కేంద్రీకృత పద్ధతిలో అమరావతి నుంచే టెండర్లను ఆహ్వానించి, తమకు కావాల్సిన వారికి పనులు దక్కేలా ‘రింగ్’ తిప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనులు ఎవరికి దక్కాలో ముందే నిర్ణయించి, అమరావతి నుంచే చక్రం తిప్పేందుకే సొంత విభాగానికి తాళం వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఏపీఈడబ్ల్యూఐడీసీకి పనుల అప్పగింతపై తీవ్ర విమర్శలు సొంత ఇంజనీరింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర? టెండర్ల పేరుతో ఏయూపై 16–18 శాతం అదనపు భారం! గతంలోనూ నాసిరకం పనులపై వీసీ లేఖ రాసినా ఫలితం శూన్యం
ప్రభుత్వ తాజా నిర్ణయంతో స్థానిక సబ్–కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏపీఈడబ్ల్యూఐడీసీ నిబంధనలన్నీ కేవలం పెద్ద కార్పొరేట్ సంస్థలకే లాభం చేకూర్చేలా.. వారు ‘రింగ్’ అయ్యేందుకే అనుకూలంగా మారుస్తారనే విమర్శలు ఉన్నాయి. వర్సిటీలో ఉండే చిన్న చిన్న పనులను కూడా విడివిడిగా కాకుండా, అన్నింటినీ కలిపి ఒకే పెద్ద ‘గంపగుత్త’ (ప్యాకేజీ) టెండరుగా మార్చే ప్రమాదం ఉందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కాంట్రాక్టర్లకు పనులు దక్కే అవకాశం పూర్తిగా మూసుకుపోతుంది. ఒకవైపు గీతం కోసం ఏయూకి చెందిన ప్రతిష్టాత్మక దూరవిద్య, డిఫెన్స్ కోర్సులను భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు వర్సిటీ ఖజానాను ఖాళీ చేస్తూ.. ఇప్పుడు ఏకంగా నిర్మాణ పనుల టెండర్లను కూడా అమరావతి నుంచే నియంత్రించేందుకు సిద్ధమవుతుండడంపై వర్సిటీ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
‘పనులన్నీ నాసిరకమే’ అంటూ వీసీ లేఖ
గతంలో ఏపీఈడబ్ల్యూఐడీసీ వ్యవహారం ఎంత దారుణంగా సాగిందంటే.. నాటి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు 2016లోనే దీనిపై ప్రభుత్వానికి బహిరంగంగానే లేఖ రాశారు. ఏపీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించిన పనులేవీ సకాలంలో పూర్తి కావడం లేదని, పైగా పనులన్నీ అత్యంత నాసిరకంగా ఉన్నాయని ఆయన ఆ లేఖలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కన్సల్టెన్సీ ఫీజు కింద వర్సిటీ 6 శాతం అదనపు సొమ్ము చెల్లించి నష్టపోతోందని, కాబట్టి ఏయూ సొంత ఇంజనీరింగ్ విభాగం ద్వారానే పనులు చేసుకునేందుకు అనుమతించాలని కోరారు. కానీ, నాటి ప్రభుత్వ పెద్దలు ఆ లేఖను బుట్టదాఖలు చేశారు. ఇప్పుడు కూడా అదే పాత దోపిడీ ఫార్ములాను అమలు చేస్తూ, వర్సిటీ హక్కులను కాలరాసేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది.


