పెళ్లింట పెను విషాదం | - | Sakshi
Sakshi News home page

పెళ్లింట పెను విషాదం

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

పుట్టింటికి వస్తుండగా ప్రమాదంలో

నవ వధువు మృతి

తీవ్రగాయాలతో ఆస్పత్రిలో

చికిత్స పొందుతున్న ఆమె తల్లి

అగనంపూడి సమీపంలో కారు స్తంభాన్ని ఢీకొనడంతో ప్రమాదం

అగనంపూడి: పెళ్లి ముచ్చట్లు తీరకముందే.. నూరేళ్ల బంధానికి పునాది పడకముందే నవవధువు అనంత లోకాలకు చేరుకుంది. భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ పుట్టింటికి వస్తున్న తరుణంలో.. మృత్యువు కారు రూపంలో ఆమెను కబలించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లికుమార్తె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ హృదయవిదారక ఘటన అగనంపూడి ఉక్కు జనరల్‌ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో గురువారం జరిగింది. పరవాడ మండలం వాడచీపురుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఈరుగుల సన్యాసమ్మ కుమారుడు నరసింగరావు (43) వాడచీపురుపల్లి పంచాయతీలో క్లాప్‌ వ్యాన్‌ డ్రైవర్‌. ఆయనకు అగనంపూడి నిర్వాసితకాలనీ కొండయ్యవలసకు చెందిన నడుపూరు పెంటారావు, కనకమహాలక్ష్మిల కుమార్తె రామేశ్వరి (31)తో బుధవారం రాత్రి వివాహం జరిగింది. తిరుగుమరుగుళ్లలో భాగంగా గురువారం సాయంత్రం 3.30 గంటల సమయంలో నవ వధువు రామేశ్వరి ఇంటికి వెళ్లేందుకు ఆమె భర్త నరసింగరావు, ఆమె తల్లి కనకమహాలక్ష్మి, సోదరి కలిసి కారులో వాడచీపురుపల్లి నుంచి అగనంపూడికి బయల్దేరారు. ఆ కారును నర్సింగరావే నడుపుతున్నాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరిపోతారనుకున్న సమయంలో అగనంపూడి ఉక్కు జనరల్‌ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో డ్రైవింగ్‌ సీట్లో ఉన్న నరసింగరావుకు కళ్లు మూతలు పడడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వీధిలైట్ల స్తంభాన్ని ఢీకొట్టింది. కారు ముందు సీట్లో కూర్చున్న వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తల్లి కనకమహాలక్ష్మి తీవ్ర గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతుంది. సోదరి వరలక్ష్మి, నర్సింగరావు కూడా గాయపడ్డారు. రామేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కన్నీరు మున్నీరవుతున్న బంధువులు

అత్తారింట్లో అడుగుపెట్టి ఆనందంగా ఉండాల్సిన వధువు ప్రమాదంలో తీరనిలోకాలకు చేరుకోవడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. పెళ్లి వేడుక ముగిసి 24 గంటలు కూడా కాకముందే పెళ్లికూతురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు సైతం కన్నీరు మున్నీరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement