ఇంధన భద్రతే దేశాభివృద్ధికి కీలకం | - | Sakshi
Sakshi News home page

ఇంధన భద్రతే దేశాభివృద్ధికి కీలకం

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

ఐఐపీఈ స్నాతకోత్సవంలో నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే సరస్వత్‌

సబ్బవరం : దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి, సాంకేతిక స్వావలంబన అత్యంత కీలకమని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే సరస్వత్‌ పేర్కొన్నారు. సబ్బవరం మండలంలోని వంగలి వద్ద గల ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) శాశ్వత ప్రాంగణంలో గురువారం నిర్వహించిన ఆరో వార్షిక స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, ఎనర్జీ స్టోరేజ్‌ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో భారత్‌ ప్రస్తుతం వేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ఆవిష్కరణాత్మక దృక్పథంతో దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఐఐపీఈ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ అధ్యక్షుడు ఆచార్య పీకే బానిక్‌ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో మొత్తం 114 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. వీరిలో 92 మంది బీటెక్‌ విద్యార్థులు, 15 మంది ఎంఎస్సీ అప్లైడ్‌ జియాలజీ విద్యార్థులతో పాటు ఇద్దరు పీహెచ్‌డీ పరిశోధకులు ఉన్నారు. విద్యలో సమగ్ర ప్రతిభ కనబరిచిన అన్సుల్‌ చటర్జీకి అత్యున్నతమైన ‘ప్రెసిడెంట్‌ గోల్డ్‌ మెడల్‌’ను అందజేశారు. అలాగే బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌లో అమితన్షు దాస్‌ బంగారు పతకాన్ని, అనుపమ్‌ ఆనంద్‌ వెండి పతకాన్ని అందుకోగా, పెట్రోలియం ఇంజనీరింగ్‌ విభాగంలో హర్షకుమార్‌ అభిజిత్‌ స్వర్ణ పతకాన్ని, సోహమ్‌ ముఖర్జీ రజత పతకాన్ని కై వసం చేసుకున్నారు. ఎంఎస్సీ అప్లైడ్‌ జియాలజీలో అమర్‌దీప్‌ ప్రసాద్‌, దేవదత్త సెంగుప్తా వరుసగా బంగారు, వెండి పతకాలను స్వీకరించారు. సంస్థ డైరెక్టర్‌ ఆచార్య శాలివాహన్‌ మాట్లాడుతూ ఐఐపీఈకి కేటాయించిన శాశ్వత ప్రాంగణంలో తొలిసారిగా స్నాతకోత్సవం నిర్వహించడం తమకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రామ్‌ ఫల్‌ ద్వివేది, బోర్డు సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement