భరోసా లేక అప్పులు | - | Sakshi
Sakshi News home page

భరోసా లేక అప్పులు

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

గంగపుత్రుల గుండె ఘోష

మత్స్యకార భరోసాపై నీలినీడలు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా పంపిణీ

గత ఏడాది ఎగ్గొట్టిన

చంద్రబాబు ప్రభుత్వం

ఈ ఏడాది ప్రశ్నార్థకం

సర్కారు తీరుపై మత్స్యకారుల ఆగ్రహం

వేట లేక పస్తులు..

మహారాణిపేట: సముద్రపు అలలనే ఊపిరిగా మల్చుకుని, గంగమ్మ తల్లి ఒడిలో వేట సాగిస్తూ జీవించే గంగపుత్రుల బతుకు నేడు అల్లకల్లోలమవుతోంది. వేట సాగితేనే కడుపు నిండే మత్స్యకారులకు, ఏటా వచ్చే 61 రోజుల వేట నిషేధ కాలం ఒక అగ్నిపరీక్షలా మారింది. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు సముద్ర సంపద సంరక్షణ కోసం ప్రభుత్వం విధించే ఈ ఆంక్షల వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ‘మత్స్యకార భరోసా’ రూపంలో అందిన సాయం ఈ సంధి కాలంలో వారికి కొండంత అండగా నిలిచేది. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలులో జాప్యం చేయడం, నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టడం మత్స్యకార గ్రామాల్లో పెను ఆందోళనకు దారితీస్తోంది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధి

గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో 2019 నుంచి 2023 వరకు క్రమం తప్పకుండా ప్రతి ఏటా వేట నిషేధ కాలంలోనే, అంటే జూన్‌ 15 లోపు మత్స్యకారుల ఖాతాల్లో రూ.10 వేలు భృతిని జమ చేసేవారు. జిల్లా వ్యాప్తంగా 2019లో 18,925 మంది, 2020లో 20,273 మంది, 2021లో 11,193 మంది, 2022లో11,389 మంది, 2023లో 12,173 మందికి లబ్ధి చేకూరింది. 2024లో ఎన్నికల కోడ్‌ కారణంగా నిలిచిపోయిన ఈ సాయాన్ని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గతేడాది పట్టించుకోలేదు. గతేడాది 12,138 మందికి ఈ భరోసా అందినా, ఈ ఏడాది మాత్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది 13,597 మందితో అర్హుల జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో ప్రదర్శించినట్లు అధికారులు చెబుతున్నా, నేటికీ నిధుల మంజూరుపై స్పష్టత లేకపోవడం గమనార్హం.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు

జిల్లాలోని 32 కిలోమీటర్ల తీర ప్రాంతం, 15 మత్స్యకార గ్రామాలు, 30 ఫిష్‌ లాండింగ్‌ కేంద్రాలపై ఆధారపడి జీవించే వేలాది మందికి ఇప్పుడు పూట గడవడం కష్టంగా మారింది. జిల్లాలో ఉన్న 668 మరపడవలు, 1272 మోటారు బోట్లు, 428 సాంప్రదాయ తెప్పలకు ఈ పథకం వర్తిస్తుంది. అయితే ప్రభుత్వం విధిస్తున్న కఠిన నిబంధనలు మత్స్యకారుల పాలిట శాపంగా మారుతున్నాయి. కుటుంబంలో ఒక్కరికే భృతి పరిమితం చేయడం, విద్యుత్‌ బిల్లు నెలకు 300 యూనిట్లు దాటితే పథకం కట్‌ చేయడం, బోట్లకు రిజిస్ట్రేషన్‌ లేదన్న వంకతో అర్హులను పక్కన పెట్టడం వంటి చర్యలు వారిని మరింత కుంగదీస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో తండ్రికి భరోసా ఇస్తే కుమారులకు నిరాకరించడం వల్ల అనేక కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.

అప్పుల్లో కూరుకుపోయిన మత్స్యకారులు

వేట ఆగి నెల రోజులు దాటిపోవడంతో, అప్పటివరకు వేటాడి తెచ్చిన కొద్దిపాటి సొమ్ము ఖర్చయి పోయింది. ప్రస్తుతం ఇల్లు గడవాలంటే వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఏది ఆగినా ఆకలి ఆగదు అన్నట్టుగా, గంగపుత్రులు తమ ఆకలి తీర్చుకోవడానికి చేబదుళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ సముద్రంలోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న తమకు, కనీసం ఈ సంధి కాలపు భత్యం సకాలంలో ఇస్తే అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉంటామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నగదు సాయమే కాకుండా, బియ్యం వంటి నిత్యావసర సరుకులు కూడా అందజేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని గంగమ్మ తల్లి బిడ్డలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అధికారుల మాటలు తప్ప, ఆచరణలో ఆదుకునే హస్తం కనిపించకపోవడంపై తీరప్రాంతం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement