పెదగంట్యాడ: క్రేన్ డ్రైవర్ బాధ్యతారాహిత్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక నిరుపేద కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. రోడ్డు పక్కన బైక్ ఆపి ఫోన్ మాట్లాడుకుంటున్న వ్యక్తిని గమనించకుండా, ప్రాణాల పట్ల కనీస విచక్షణ లేకుండా క్రేన్‌తో తొక్కించి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గంగవరం గ్రామానికి చెందిన కంబాల మాధవరావు (45) బుధవారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడంతో, ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ ముట్టడికి దిగారు. గురువారం ఉదయం నుంచే కంపెనీ గేటు ముందు భైఠాయించిన బాధితులు, న్యాయం చేయాలంటూ హోరెత్తించిన నినాదాలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రమాదం జరిగిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. మృతుడి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి ఆందోళన చేపట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో న్యూపోర్టు పోలీసులు రంగ ప్రవేశం చేసి బందోబస్తు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ 64వ వార్డు అధ్యక్షుడు ధర్మాల శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు, బాధితులు కలిసి శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. అయితే యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ లభించడంతో చర్చలు ఫలించాయి. న్యూపోర్టు పోలీసుల చొరవతో బాధితులు తమ ఆందోళనను విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
నిబంధనలు బేఖాతరు
గంగవరం రోడ్డులో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ, శ్రావణ్ కంపెనీ నిబంధనలను బేఖాతరు చేస్తూ మృత్యుశకటాలను నడుపుతోంది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ రహదారిపై భారీ వాహనాల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు వ్యక్తులతో పాటు నాలుగు పశువులు ప్రాణాలు కోల్పోవడం ఇక్కడి ప్రమాదకర స్థితికి అద్దం పడుతోంది. తమకు న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, రోడ్డుపైనే టెంట్ వేసి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు
శ్రావణ్ షిప్పింగ్ కంపెనీకి ప్రాణాలంటే కనీస గౌరవం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా అతివేగంతో భారీ వాహనాలను నడుపుతూ మృత్యుఘంటలు మోగిస్తున్నారు. ఇప్పటికే ఈ వాహనాల వల్ల ఏడుగురు వ్యక్తులు, నాలుగు ఆవులు బలైపోయాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. పోలీసులు వెంటనే స్పందించి ఈ రోడ్డుపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించాలి. లేనిపక్షంలో కంపెనీకి నిప్పు పెట్టడానికై నా వెనకాడం.
– బడి సోములమ్మ, గంగవరం
నిర్లక్ష్యం వీడాలి
గంగవరం, యారాడ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. సరిగ్గా అదే సమయంలో శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ భారీ వాహనాలు అతివేగంగా, బాధ్యతారాహిత్యంగా దూసుకొస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. గతంలో ఎన్నో ఘోరాలు జరిగినా, ఎందరో ప్రాణాలు కోల్పోయినా ఈ వాహనాలను అదుపు చేయకపోవడం శోచనీయం. ఇప్పటికై నా పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం.
–పేర్ల నల్లయ్య, గంగవరం


