హత్య కేసులో ఇద్దరు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఇద్దరు అరెస్టు

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

పీఎం పాలెం: సుమారు రెండు నెలల క్రితం జరిగిన ఓ హత్య కేసు మిస్టరీని పీఎం పాలెం పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పీఎం పాలెం సీఐ జి. బాలకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ ఆరో వార్డు పరిధిలోని బక్కన్నపాలెం ప్రాంతంలో గల ఎంవీవీ కన్‌స్ట్రక్షన్స్‌ వద్ద పనిచేసే కార్మికుల మధ్య జరిగిన ఘర్షణే ఈ హత్యకు దారితీసింది. జార్ఖండ్‌కు చెందిన సికందర్‌ కుమార్‌ అనే భవన నిర్మాణ కార్మికుడికి మద్యపానం వ్యసనం ఉంది. నిత్యం మద్యం సేవించి తోటి కార్మికులను అసభ్య పదజాలంతో దూషించడం, వారిపై దౌర్జన్యం చేయడం వంటి పనులతో అందరికీ తలనొప్పిగా మారాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌ 14న సికందర్‌ కుమార్‌ పనికి వెళ్లకుండా ఇతర కార్మికులతో గొడవకు దిగాడు. అతడిని పనికి తీసుకువచ్చిన సూపర్‌ వైజర్లు, జార్ఖండ్‌ రాష్ట్రానికే చెందిన శ్యామ్‌ప్రకాష్‌ సింగ్‌, అన్సారీలు అతడిని మందలించారు. అయితే.. సికందర్‌ వారిపైనే ఎదురుదాడికి దిగడంతో వాగ్వాదం కాస్తా పెను ఘర్షణగా మారింది.దీంతో కోపోద్రిక్తులైన శ్యామ్‌ప్రకాష్‌ సింగ్‌, అన్సారీలు సికందర్‌పై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న అతడిని సమీపంలోని తుప్పల్లో పడేసి వెళ్లిపోయారు. కొంత సమయం తర్వాత వచ్చి చూడగా సికందర్‌ మృతిచెందినట్టు గుర్తించారు. ఈ విషయం బయటకు తెలిస్తే హత్యానేరం తమపై పడుతుందన్న భయంతో నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారై తమ సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌లో తలదాచుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనను హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్‌ అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితుల సెల్‌ ఫోన్‌ డేటా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారు జార్ఖండ్‌లో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు. గురువారం వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం నిందితులకు రిమాండ్‌ విధించింది. కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement