యారాడ తీరంలో ఇంటర్‌ విద్యార్థి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

యారాడ తీరంలో ఇంటర్‌ విద్యార్థి గల్లంతు

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

పెదగంట్యాడ: యారాడ తీరంలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగి ఓ ఇంటర్‌ విద్యార్థి గల్లంతవ్వగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. న్యూపోర్ట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిబ్బపాలెం గ్రామానికి చెందిన కదిరి వికాస్‌ (17) గాజువాకలోని ఓ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో గురువారం సాయంత్రం తన స్నేహితుడు కదిరి భూలోకరాజుతో కలిసి సరదాగా గడిపేందుకు యారాడ బీచ్‌కు వెళ్లాడు. బీచ్‌లో కాసేపు గడిపిన అనంతరం ఇద్దరూ స్నానం కోసం సముద్రంలోకి దిగారు. అయితే కెరటాల ఉధృతికి ఇద్దరూ లోపలికి కొట్టుకుపోతుండగా, అక్కడే ఉన్న కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది గమనించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. భూలోకరాజును చాకచక్యంగా కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. వికాష్‌ను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అలల తాకిడికి వికాస్‌ సముద్రంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న న్యూపోర్ట్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాణాలతో బయటపడిన భూలోకరాజును చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తండ్రి అప్పన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement