తీరని భూ వ్యాధులు! | - | Sakshi
Sakshi News home page

తీరని భూ వ్యాధులు!

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

పదే పదే అర్జీ ఇస్తున్నా పరిష్కరించని రెవెన్యూ సిబ్బంది ఇప్పటి వరకు 1179 అర్జీలు.. 187 మాత్రమే పరిష్కారం మండలం వదిలి కలెక్టరేట్‌కు క్యూ కడుతున్న జనం కుంటిసాకులతో కాలయాపన చేస్తున్న యంత్రాంగం

రెవెన్యూ క్లినిక్‌లు..

22ఏ ఉచ్చులో సామాన్యుడు

జిల్లాలో ప్రధానంగా 22ఏ నిషిద్ధ జాబితా నుంచి భూముల తొలగింపు అంశం జటిల సమస్యగా మారింది. తరతరాలుగా అనుభవిస్తున్న భూములు కూడా సాంకేతిక కారణాలతో ఈ జాబితాలో చేరిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తహసీల్దార్‌, ఆర్డీవో స్థాయి అధికారులు నివేదికలు పంపినా, ఉన్నతాధికారులు వాటిపై నిర్ణయం తీసుకోకుండా కొర్రీలు వేస్తున్నారు. ఫైళ్లను వెనక్కి పంపడం లేదా అమరావతిలోని సీసీఎల్‌ఏ కార్యాలయానికి పంపించి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. క్లినిక్‌ పేరుతో కాలయాపన చేయకుండా, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి శాశ్వత విముక్తి కల్పించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వ ఆరంభ శూరత్వం మరోసారి బయటపడింది. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌ల పేరుతో చేసిన హడావుడి ‘అట్టర్‌ ఫ్లాప్‌ షో’గా మారింది. తమ భూములను కాపాడుకునేందుకు, రికార్డుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు బాధితులు అధికారుల చుట్టూ తిరగడంతోనే కాలం గడిచిపోతోంది. పారదర్శకత, వేగవంతమైన పరిష్కారం అంటూ ఊదరగొట్టిన సర్కారు.. క్షేత్రస్థాయి అమలులో మాత్రం చేతులెత్తేసింది. ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌తో పాటు రెవెన్యూ క్లినిక్‌ పేరుతో భూ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ విధానం బాధితులకు ఊరటనివ్వకపోగా, అదనపు భారంగా మారింది.

మండలాలకు తాళం..

గతంలో ప్రజలు తమ సమస్యల కోసం సమీపంలోని తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ప్రతి సోమవారం మండల స్థాయిలో ఉండాల్సిన తహసీల్దార్లు, డివిజన్‌ స్థాయిలో ఉండాల్సిన ఆర్డీవోలు అందరూ తమ కార్యాలయాలకు తాళం వేసి కలెక్టరేట్‌లోని రెవెన్యూ క్లినిక్‌కు వస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు తమ గోడు వెళ్లబోసుకోవడానికి వందల రూపాయలు ఖర్చు చేసుకుని, వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావాల్సి వస్తోంది. కలెక్టరేట్‌లో వినతిపత్రం తీసుకుంటున్నారే తప్ప, అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు.

10 దశల ప్రక్రియ.. అంతా అయోమయం!

రెవెన్యూ క్లినిక్‌లో ఫిర్యాదు చేస్తే చాలు సమస్య తీరిపోతుందని ప్రచారం చేసిన ప్రభుత్వం, అందులో 10 దశల క్లిష్టమైన ప్రక్రియను పెట్టి సామాన్యులను అష్టకష్టాల పాలు చేస్తోంది. రీ–సర్వే లోపాలు, ఎఫ్‌–లైన్‌ పిటిషన్లు, 22ఏ తొలగింపు వంటి 14 రకాల అంశాలపై అర్జీలు తీసుకుంటున్న అధికారులు.. వాటిని పరిష్కరించడంలో మాత్రం నత్తనడకన సాగుతున్నారు. ముఖ్యంగా 22ఏ జాబితా నుంచి భూముల తొలగింపు అంశం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.

1179 వినతులు.. 187 పరిష్కారాలు!

ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది డిసెంబర్‌ 10వ తేదీ నుంచి జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవోలు కూడా హాజరవుతున్నారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు వినతులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు మొత్తం 1179 అర్జీలు వచ్చాయి. అందులో కేవలం 187 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. మరోవైపు ఏకంగా 388 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. ఇంకా 604 వినతులు వివిధ దశల్లో పెండింగ్‌లోనే మూలుగుతున్నాయి.

గణాంకాలు చెబుతున్న ‘వైఫల్యం’

మొత్తం వినతులు 1179

పరిష్కరించినవి 187

తిరస్కరించినవి 388

పెండింగ్‌ 604

Advertisement
 
Advertisement
Advertisement