సీతంపేట: ప్రతి నెల రెండో బుధవారం నిర్వహించే ‘సువిధా సమాగం’ కార్యక్రమాన్ని నరసింహనగర్‌లోని ఈఎస్‌ఐ కార్పొరేషన్ ఉప ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, యాజమాన్య ప్రతినిధులు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈఎస్‌ఐ సంస్థ జాయింట్ డైరెక్టర్ కె.ఆర్.రవికుమార్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ప్రతినిధి డాక్టర్ లలిత, మల్కాపురం ఈఎస్‌ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ప్రతినిధి డాక్టర్ శేషగిరి, అసిస్టెంట్ డైరెక్టర్ వేమూరి శ్యామ్ ప్రసాద్ నేతృత్వం వహించారు. కార్మికులు విన్నవించుకున్న సమస్యలలో కొన్నింటికి అధికారులు తక్షణ పరిష్కారం చూపారు. మిగిలిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తదుపరి ‘సువిధా సమాగం’కార్యక్రమం జూన్ 10న మధ్యాహ్నం 3 గంటలకు ఇదే కార్యాలయంలో జరుగుతుందని అధికారులు వెల్లడించారు.


