ఆనందపురం: జిల్లాలోని రెండు మండలాలకు అరుదైన గౌరవం దక్కింది. ఆనందపురం మండలంలోని వెల్లంకి, పెందుర్తి మండలంలోని ఎస్‌ఆర్‌పురం గ్రామ పంచాయతీలు ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌వో 9001:2015 సర్టిఫికేషన్‌కు ఎంపికయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ గుర్తింపు కోసం మొత్తం 24 పంచాయతీలను ఎంపిక చేయగా, గత 18 నెలలుగా సాగిన సుదీర్ఘ కసరత్తు, వివిధ దశల పరిశీలనల అనంతరం ఈ రెండు గ్రామాలు తుది జాబితాలో నిలిచి రికార్డు సృష్టించాయి. ఈ సర్టిఫికేషన్ ద్వారా సదరు పంచాయతీల్లో రికార్డుల శాసీ్త్రయ నిర్వహణ, పారదర్శకమైన ప్రజా సేవలు, పన్నుల వసూళ్లలో సమర్థత, కార్యాలయ పరిశుభ్రత వంటి అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు అమలు కానున్నాయని అధికారులు వెల్లడించారు. గత మూడు రోజులుగా ‘టాటా క్వాలిటీ సెర్ట్ సర్వీసెస్’ ప్రతినిధి శ్రీజిత్ కె. అనిరుధ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆడిట్ అనంతరం ఈ సర్టిఫికేషన్‌ను ఖరారు చేశారు. ముఖ్యంగా వెల్లంకి పంచాయతీలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, ప్రజలకు త్వరితగతిన సేవలందించే విధానం, సిబ్బంది సత్ప్రవర్తనను ఆడిట్ ప్రతినిధులు స్వయంగా పరిశీలించి ప్రత్యేకంగా ప్రశంసించారు. తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ లైజన్ ఆఫీసర్ ఇమాముద్దీన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా స్వర్ణ గ్రామ అధికారి ఆర్.పూర్ణిమాదేవి, డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఇ.జి.ఉషారాణి, ఆనందపురం డిప్యూటీ ఎంపీడీవో భూపతి సత్యనారాయణ, జీఏవి శ్రీరామ్మూర్తి, వంకర ప్రసాద్, స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.


