తాటిచెట్లపాలెం: బెంగళూరులోని హలసూరు గేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాలు దొంగిలించిన నలుగురిని విశాఖ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీఆర్పీ సిబ్బంది తెలిపిన వివరాలు... జీఆర్పీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ సీహెచ్ ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ ఎస్‌ఐలు బి.శేషసాయి, టి.శ్రీనివాసరావు, సీపీడీఎస్ సిబ్బంది విశాఖ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని గుర్తించి, వారి బ్యాగుల్ని పరిశీలించారు. వారి వద్ద సుమారు 550 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.71,163ల నగదు లభ్యమైంది. విచారించగా వీరు ఈ ఆభరణాలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని హలసూరు గేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగిలించినవిగా గుర్తించారు. వీటి గురించి అక్కడ కేసు నమోదైనట్లు తెలుసుకుని, వారి నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం కర్ణాటక పోలీసులకు అప్పగించినట్లు జీఆర్పీ సిబ్బంది తెలిపారు. నిందితులు పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు చెందిన ఎస్‌కే ముస్తాక్ ఆలీ, రంజన్‌మిద్య, ఎస్‌కే మిర్జుల్ ఇస్లాం, ఎస్‌కే లాలన్ ఆలీలుగా వెల్లడించారు.


