సొంత దుకాణం! | - | Sakshi
Sakshi News home page

సొంత దుకాణం!

May 15 2026 9:56 AM | Updated on May 15 2026 9:56 AM

8లో

ఓ ప్రొఫెసర్‌ నిర్వాకం

గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :

కవైపు ప్రభుత్వం ఆంధ్రా యూనివర్సిటీ నిధులను వందల కోట్ల మేర మళ్లించి ఆర్థికంగా కుదేలు చేస్తుంటే.. మరోవైపు యూనివర్సిటీలోనే ఉన్నత హోదాల్లో ఉన్న కొందరు అధికారులు ఖజానాకు రావాల్సిన కన్సల్టెన్సీ ఆదాయాన్ని సొంత ఖాతాల్లోకి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఏకంగా వ్యక్తిగత జీఎస్‌టీ నంబర్‌, సొంత బ్యాంకు ఖాతాలతో కన్సల్టెన్సీ ఫీజులను వసూలు చేసి లక్షల రూపాయలు దండుకున్న ఓ ప్రొఫెసర్‌ వ్యవహారం ఇప్పుడు ఏయూలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే వేతనాల చెల్లింపులకే నిధుల్లేక ఇబ్బందులు పడుతున్న యూనివర్సిటీలో ఈ అక్రమాలు మరింత ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి.

నిబంధనలు గాలికి.. నిధులు ఖాతాలోకి

సాధారణంగా ఇంజనీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, సాంకేతిక రంగాలకు సంబంధించిన డిజైన్లు, సలహాలు, ప్రాజెక్టు అంచనాలు, పరిశోధనల కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు యూనివర్సిటీని సంప్రదిస్తాయి. ఈ సేవలను సంబంధిత విభాగాల ప్రొఫెసర్లు కన్సల్టెన్సీ రూపంలో అందిస్తారు. ఇందుకు సంబంధించిన ఫీజు మొత్తం యూనివర్సిటీ ఖజానాలో జమ కావాలి. యూనివర్సిటీ జీఎస్‌టీ నంబర్‌, అధికారిక బ్యాంకు ఖాతాల ద్వారానే ఈ లావాదేవీలు జరగాల్సి ఉంటుంది. అయితే, నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కిన ఓ ప్రొఫెసర్‌ వ్యక్తిగత జీఎస్‌టీ నంబర్‌ను తీసుకుని, కన్సల్టెన్సీ సేవల పేరుతో వచ్చిన మొత్తాలను నేరుగా తన ఖాతాల్లోకి మళ్లించినట్టు తెలుస్తోంది. విషయం బయటకు వస్తుందనే అనుమానంతో ఆ జీఎస్‌టీ నమోదును ఇటీవల రద్దు చేసుకున్నారన్న ప్రచారం కూడా ఏయూ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

సంస్థా‘గత’ లాభం.. ప్రొఫెసర్ల సొంతం

వాస్తవానికి కన్సల్టెన్సీ ద్వారా వచ్చే ఆదాయాన్ని యూనివర్సిటీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌కు జమ చేస్తారు. అనంతరం నిబంధనల ప్రకారం అందులో భాగాన్ని సంబంధిత ప్రొఫెసర్‌కు పారితోషికంగా చెల్లిస్తారు. ఈ విధానం వల్ల యూనివర్సిటీకి ఆదాయం రావడంతో పాటు పరిశ్రమలు–విద్యాసంస్థల మధ్య అనుసంధానం బలపడుతుంది. విద్యార్థులకు కూడా ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ అందుతుంది. కానీ, ఈ వ్యవస్థనే కొందరు వ్యక్తిగత సంపాదన మార్గంగా మార్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ విభాగాల్లో కన్సల్టెన్సీ ప్రాజెక్టులు అధికంగా ఉండటంతో భారీ మొత్తాలు చేతులు మారుతున్నాయని సమాచారం.

అవినీతి ‘తిమింగలానికి’ అందలమా?

సదరు ప్రొఫెసర్‌ తన వ్యక్తిగత జీఎస్‌టీ, బ్యాంకు ఖాతాలను సమర్పించి కన్సల్టెన్సీ ఫీజుల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేసినట్టు యూనివర్సిటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికే కూటమి ప్రభుత్వం ఇటీవల మరింత ఉన్నత హోదా కల్పించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రొఫెసర్‌ వ్యవహారశైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. అయినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్నతస్థాయి అండదండలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శతాబ్ది సంబరాల్లో.. అక్రమాల జాతర

ఇటీవల నిర్వహించిన ఏయూ శతాబ్ది ఉత్సవాల ఖర్చులపైనా పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏయూ నిధుల నుంచే రూ.63.50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ వ్యయాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీచ్‌ రోడ్డులో నిర్వహించిన ర్యాలీకి ఓ ప్రైవేటు సంస్థ టీషర్టులను స్పాన్సర్‌ చేసినప్పటికీ, ఆ ఖర్చును కూడా కలిపి సుమారు రూ.10 లక్షల వరకు వ్యయం చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి. టెంట్లు, భోజన ఏర్పాట్లు, స్టేజ్‌ నిర్మాణం తదితర పనుల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాల్లోనూ మిగిలిన ఉన్నతాధికారులతో పాటు సదరు ప్రొఫెసర్‌ భారీగా దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

జీతాలకు కరవు.. ‘గీతం’కి లబ్ధి

ఒకవైపు యూనివర్సిటీ నిధుల మళ్లింపు, మరోవైపు అంతర్గత అవినీతి కారణంగా ఏయూ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలో సగం రోజులు పూర్తవుతున్నా ఉద్యోగులకు వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జీతాల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. మరోవైపు ఏయూలోని డిఫెన్స్‌, దూరవిద్య విభాగాలను నిర్వీర్యం చేస్తూ.. పక్కనే ఉన్న గీతం యూనివర్సిటీకి లబ్ధి చేకూరుస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. చంద్రబాబు సర్కార్‌ అనుసరిస్తున్న తీరు చూస్తుంటే.. వర్సిటీని భ్రష్టు పట్టించి, చివరకు ఎంపీ భరత్‌ తాత మూర్తి చెప్పినట్టుగా ఏయూని ’దెయ్యాల కొంప’గా మార్చేందుకు ఉన్నతాధికారులు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది.

యూనివర్సిటీ ఖజానాకు రావాల్సిన కన్సల్టెన్సీ ఫీజుల మళ్లింపు

వ్యక్తిగత జీఎస్‌టీ, బ్యాంకు ఖాతాలతో లక్షల రూపాయల వసూళ్లు

రూ.300 కోట్ల నిధుల మళ్లింపుతో కుదేలైన ఏయూకు అంతర్గత దోపిడీ దెబ్బ

శతాబ్ది ఉత్సవాల ఖర్చుల్లోనూ భారీ అక్రమాల ఆరోపణలు

‘ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?’ అన్న చందంగా తయారైంది ఆంధ్రా యూనివర్సిటీ పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వమే వందల కోట్ల నిధులను పక్కదారి పట్టించి వర్సిటీని ఆర్థికంగా కుదేలు చేస్తుంటే.. ‘మేమేం తక్కువ?’ అన్నట్లుగా ఉన్నతాధికారులు కూడా కన్సల్టెన్సీ ఫీజులను సొంత ఖాతాలకు మళ్లిస్తూ వర్సిటీ ఖజానాకు కన్నం వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement