‘చైన్‌’ చోరీలతో బెంబేలు | - | Sakshi
Sakshi News home page

‘చైన్‌’ చోరీలతో బెంబేలు

May 15 2026 9:56 AM | Updated on May 15 2026 9:56 AM

కంచరపాలెం, ఎయిర్‌పోర్టు స్టేషన్ల పరిధిలో నాలుగు చోరీలు

ఉదయం 7.30 నుంచి 11.30 మధ్యే చోటు చేసుకున్న ఘటనలు

గోపాలపట్నం: విశాఖనగరంలో ఒకే రోజు గంటల వ్యవధిలో నాలుగు చోట్ల జరిగిన చైన్‌ స్నాచింగ్‌లతో ప్రజలు హడలెత్తిపోయారు. కంచరపాలెం, ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7.30 నుంచి 11.30 మధ్య నాలుగు చోట్ల చైన్‌ స్నాచర్లు చెలరేగిపోయారు. మహిళల మెడల్లో ఉన్న చైన్లను తెంచుకుపోయారు. బాధితులు పోలీసులు తెలిపిన వివరాలు..

మొదటి చోరీ..

ఉదయం 7.30 సమయంలో మర్రిపాలెం జ్యోతీనగర్‌ వద్ద పంచముఖి లక్ష్మి(62) కాయగూరలు కొనుగోలు చేసేందుకు వచ్చింది. 7.45 గంటలకు తిరుగుముఖం పడుతూ ఇంటి సందులో మలుపుతిరుగుతున్న సమయంలో కాపుకాసి ఉన్న దుండగుడు వెనక నుంచి వచ్చి మెడలోని గొలుసు తెంచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన లక్ష్మి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో కొంత భాగం తెంచుకుపోయాడు. లాకెట్టు, చైన్‌లో సగభాగం తన చేతిలో ఉండిపోయింది. సుమారు రెండున్నర తులాల వరకు దుండగుడు లాక్కెళ్లిపోయినట్లు బాధితురాలు వాపోతోంది.

రెండో చోరీ

పంజాబ్‌ హోటల్‌ జంక్షన్‌ వద్ద ఉదయం 8.05 గంటల సమయంలో రాజీవ్‌నగర్‌కు చెందిన నిడమల రత్నకుమారి విధులకు హాజరయ్యేందుకు బస్టాప్‌ సమీపంలోని సర్వీస్‌ రోడ్డులో ఆటో కోసం నిరీక్షిస్తోంది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో పుస్తెల తాడు, నల్లపూసల దండ తెంచుకెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె అప్రమత్తం కావడంతో చేతిలో పుస్తెలు, నల్లపూసల దండ కొంతభాగం ఉండిపోయింది. మిగిలిన సుమారు రెండున్నర తులాలు తెంచుకుపోయాడు.

మూడో చోరీ

ఉదయం 8.15 గంటల సమయంలో కంచరపాలెం జైభారత్‌నగర్‌ వద్ద ఎస్‌ కోట దరి జామి వెళ్లేందుకు వర్రి అరుణ బస్టాప్‌కు నడుస్తూ వస్తోంది. కాపుకాసిన దుండగుడు రెండు తులాల గొలుసు, రెండు తులాల నల్లపూసల దండ లాక్కుపోయాడు.

నాలుగో చోరీ

విమాన్‌నగర్‌ వద్ద అదే ప్రాంతానికి చెందిన ఎం.అచ్చయ్యమ్మ(56) ఉదయం 11.30కు నగరంలో జరిగే ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు బస్టాప్‌ వద్ద నిరీక్షిస్తోంది. అక్కడే ఉన్న ఓ యువకుడు ఆమెను సమీపించాడు. బైక్‌పై మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న 5 తులాల నల్లపూసల దండ, చైన్‌ తెంచుకుని బైక్‌పై వెళ్లిపోయారు. గమనించిన ఓ వ్యక్తి తన బైక్‌తో వెంబడించే ప్రయత్నం చేసినా ఆ వ్యక్తిని ఢీకొట్టేందుకు యత్నించి తప్పించుకుపోయారు.

కరాసా వద్ద బైక్‌ చోరీ

ఆ సమయంలోనే కరాసాకు చెందిన ఓ యువకుడి ద్విచ్రవాహనం చోరీకి గురయింది. కరాసా వద్ద నైట్‌ ఫుడ్‌ స్టాల్స్‌ ఉన్న చోట 10.30 సమయంలో పార్కింగ్‌ చేసిన తన బైక్‌ను ఎవరో దొంగిలించడంతో బాధితుడు వెంటనే వాట్సాప్‌ ఫిర్యాదుతోపాటు, స్టేషన్‌లో రాతపూర్వక ఫిర్యాదు కూడా చేశాడు. తన బైక్‌తోనే ఈ చోరీలకు పాల్పడ్డారేమోనని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఉదయం 7.30 నుంచి దొంగతనాలు జరుగుతుండటంతో ఈ వాహనం వాడి ఉండరని పోలీసులు చెప్తున్నారు. చైన్‌ స్నాచింగ్‌లపై బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్రమౌళి తెలిపారు.

కంచరపాలెం పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు

సీసీ కెమెరాల్లో చిక్కిన స్నాచర్ల ముఖాలు

Advertisement
 
Advertisement
Advertisement