అధికార పార్టీ నేతల తొత్తులుగా కొంతమంది పోలీసులు వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో శాంతియుత నిరసన
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, ప్రతిపక్ష పార్టీ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. జీవీఎంసీ ఎదుటనున్న గాంధీ విగ్రహం వద్ద పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. కర్నూలులో వైఎస్సార్ సీపీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు బాలుపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధించడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ విశాఖ జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డిపై మాదకద్రవ్యాల పేరుతో అక్రమంగా కేసులు మోపి, బెయిల్ రాకుండా వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారని మండిపడ్డారు.
యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు మాట్లాడుతూ ఎన్నికల హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.
యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మహమ్మద్ ఇమ్రాన్, ఉత్తరాంధ్ర యుజన విభాగం అధ్యక్షుడు అంబటి శైలేష్ మాట్లాడుతూ.. పోలీస్ కేసులతో భయపెట్టి వైఎస్సార్ సీపీ యువజన విభాగం నోరు నొక్కాలని చూస్తే.. అంతకు రెట్టింపు బలంతో ప్రజా సమస్యలపై, ఎన్నికల హామీలపై ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు.
కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ , విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ్, యువజన విభాగం రాష్ట్ర నాయకులు కిరణ్, కనకాల ఈశ్వర్, గుజ్జు ధీరజ్ రెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎస్‌కే మహంతి, సనపల రవీంద్ర భరత్, నీలి రవి, మనోజు, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మువ్వల సంతోష్, తాడి రవితేజ, రవి కిరణ్, పార్టీ నాయుకులు బిపిన్ కుమార్ జైన్, భీశెట్టి ప్రసాద్, ఉమ్మడి కళ్యాణ్, చంద్రమౌళి, రమేష్, రాఘవులు, సురేష్, హరికృష్ణ, రాజు, కొట్యాడ సూర్య తదితరులు పాల్గొన్నారు.


