మహారాణిపేట: జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ‘జలధార–జలహారతి’ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జలధార–జలహారతి 100 రోజుల కార్యక్రమంపై ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు పని కల్పించడంతో పాటు, చెరువుల పూడికతీత, గట్ల బలోపేతం, కాలువల డిసిల్టింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళలకు మెరుగైన జీవనోపాధి కల్పించేలా గ్రూప్ యాక్టివిటీస్‌ను పెంచాలని డీఆర్డీఏ పీడీకి సూచించారు. పెట్టుబడుల కోసం సమన్వయంతో పనిచేయాలి
జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాల ప్రగతిని, గ్రౌండింగ్ దశలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేటు భూములను కూడా సమీకరించే అవకాశాలను పరిశీలించాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యుత్, రహదారుల వంటి మౌలిక వసతులను ముందస్తుగానే కల్పించాలని స్పష్టం చేశారు. పర్యాటక, ఐటీ, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, ఆర్డీవోలు, ఏపీఐఐసీ అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


