డాబాగార్డెన్స్: జీవీఎంసీ, గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ అందించిన మూడు అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంవోహెచ్‌యూఏ) ఆధ్వర్యంలో నేషనల్ అపెక్స్ కమిటీ(ఎన్‌ఏసీ) ఈ నెల 11న న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు వెల్లడించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. నేషనల్ అపెక్స్ కమిటీ సమావేశంలో మూడు ప్రాజెక్టుల ప్రతిపాదనలు కమిటీకి అందించామన్నారు. మధురవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, 24/7 తాగునీటి సరఫరా, నగరవ్యాప్తంగా బల్క్ అండ్ సెమీ బల్క్ నీటి సరఫరా వ్యవస్థ ఆటోమేషన్ ప్రాజెక్టులకు రూ.1501.03 కోట్ల వ్యయంతో ఆమోదం దక్కినట్లు పేర్కొన్నారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద రూ.375.26 కోట్ల గ్రాంట్ లభించనుందన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా జీవీఎంసీ పరిధిలోని మధురవాడ, ఈస్ట్, భీమిలో జోన్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు ఆధునిక యూజీడీ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.


