సంక్రాంతి వేళ అప్పన్న దర్శన వేళల్లో మార్పులు
సింహాచలం: సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత ఆదివారం తెలిపారు. ఈ నెల 14న భోగి సందర్భంగా సింహగిరికి భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్వామి వారిని నీలాద్రి గుమ్మం వద్ద నుంచే దర్శించుకునేలా లఘు దర్శనం ఏర్పాటు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు పవళింపు సేవ కారణంగా దర్శనాలు ఉండవు. 16 కనుమ పండగ, 18న తెప్పోత్సవం సందర్భంగా సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు మూలవిరాట్ దర్శనం లభిస్తుంది. ఈ నెల 19న రాత్రి 7 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఆ రోజు ఆలయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు ఈవో పేర్కొన్నారు.


