క్రీడకు కళ తోడైతే..
ఏయూక్యాంపస్: క్రీడా స్ఫూర్తికి కళాత్మకత తోడైతే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం విశాఖ వేదికగా జరుగుతున్న 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీల్లో ఇదే ఆవిష్కృతమైంది. నగరంలోని శివాజీ పార్క్ వేదికగా ఉత్సాహంగా సాగిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ విభాగం పోటీలు గురువారంతో ముగిశాయి. కేవలం శారీరక దారుఢ్యం, వేగమే కాకుండా.. సంగీతానికి అనుగుణంగా హావభావాలను పలికిస్తూ, చక్రాలపై చిన్నారులు చేసిన నాట్యం చూపరులను కట్టిపడేసింది. ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో జంప్‌లు, స్పిన్‌లు, ఫుట్ వర్క్‌తో పాటు నృత్య సౌందర్యం కీలకం. ఈ పోటీల్లో 6 నుంచి 15 ఏళ్ల వయసున్న బాలబాలికలు ఫిగర్స్, ఫ్రీ స్కేటింగ్, డ్యాన్స్ స్కేటింగ్, ప్రెసిషన్ విభాగాల్లో తమ ప్రతిభను చాటారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ అభినయంతో విశాఖ వేదికను మురిపించారు. ఏళ్ల తరబడి చేస్తున్న కఠోర సాధన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వీరి ప్రదర్శనలు ఈ క్రీడలో భారతీయ భవిష్యత్తును చాటి చెప్పాయి.
కఠోర సాధన.
నాలుగేళ్ల వయసు నుంచే స్కేటింగ్ నేర్చుకుంటున్నాను. ఇది నాకు నాలుగో జాతీయ స్థాయి పోటీ. ఇప్పటివరకు 8 గోల్డ్, 3 బ్రాంజ్, 2 సిల్వర్ మెడల్స్ సాధించాను. ఈ స్థాయికి రావడానికి రోజూ ఉదయం 4 గంటలకే లేచి, ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు సాధన చేస్తాను.
– బి.లాస్య శ్రీ
చదువు, క్రీడ.. సమన్వయం
గత తొమ్మిదేళ్లుగా స్కేటింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. ప్రస్తుతం విశాఖ వ్యాలీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నా. ఆర్టిస్టిక్ విభాగంలో ఇప్పటివరకు 100కి పైగా పతకాలు సాధించాను. రోజూ రెండు గంటల పాటు సాధన చేస్తూనే, చదువుకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నాను. ఈ సారి జాతీయ పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.
– ఎ.వైణవి
అంతర్జాతీయ పతకాలే లక్ష్యం
ఆర్టిస్టిక్ స్కేటింగ్‌తో పాటు ఇన్‌లైన్, ఫిగర్, ఫ్రీ స్టైల్ విభాగాల్లోనూ రాణిస్తున్నాను. ఇప్పటివరకు 90కి పైగా మెడల్స్ సాధించాను. ఈ ఏడాది దక్షిణ కొరియాలో జరిగిన ఏషియన్ రోలర్ స్కేటింగ్‌లో, 2023లో ఆస్ట్రేలియా పసిఫిక్ కప్‌లో నాలుగు స్వర్ణ పతకాలు గెలవడం నా కెరీర్‌లో మరిచిపోలేను. అంతర్జాతీయ వేదికలపై దేశానికి మరిన్ని పతకాలు తేవడమే నా లక్ష్యం.
– బి.రిషిల్
ఆసియా క్రీడల
అనుభవంతో..
గత 11 ఏళ్ల సాధనలో 80కి పైగా పతకాలు వచ్చాయి. 2023లో చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని పతకాలు సాధించడం మంచి అనుభవాన్ని ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్స్‌లో రెండు సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ రావడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నాను.
– ఆర్.కెలిన్ కార్తికేయన్
డాక్టరవుతా.. స్కేటింగ్‌లో రాణిస్తా..
నేను గత 13 ఏళ్లుగా స్కేటింగ్ చేస్తున్నాను. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 7 బంగారు పతకాలు సాధించాను. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాను. వచ్చే ఏడాది నీట్ రాసి వైద్య వృత్తిలోకి వెళ్లాలనేది నా ఆశయం. సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వాడుకుంటూ అటు చదువులోనూ, ఇటు స్కేటింగ్‌లోనూ రాణిస్తున్నాను. – పి.సహీరా
క్రీడకు కళ తోడైతే..
క్రీడకు కళ తోడైతే..
క్రీడకు కళ తోడైతే..
క్రీడకు కళ తోడైతే..
క్రీడకు కళ తోడైతే..
క్రీడకు కళ తోడైతే..


