
ఆగస్టు 31 నాటికి 50 శాతం ఆస్తిపన్ను వసూలే లక్ష్యం
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
డాబాగార్డెన్స్: వచ్చే నెల 31 నాటికి 50 శాతం ఆస్తి పన్ను వసూలే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు పనిచేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి, డీసీఆర్ శ్రీనివాసరావు, అన్ని జోన్‌ల రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆగస్టు 31 నాటికి 50 శాతం ఆస్తిపన్ను వసూలు లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. గత వారంతో పోల్చుకుంటే కొన్ని జోన్లలో వసూళ్ల శాతం పెరిగినప్పటికీ మరికొన్ని జోన్లలో మందకొడిగా వసూళ్లు జరుగుతున్నాయన్నారు. ప్రతి రెవెన్యూ అధికారి డిమాండ్లకు తగిన విధంగా ఆస్తిపన్ను వసూళ్లు పెంచాలని ఆదేశించారు. వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు డోర్ టు డోర్ సర్వే నిర్వహించి, కొత్త, పాత భవనాల కొలతలు సరి చూడాలని, తాగునీటి కనెక్షన్ ఉంటే వారు ఆస్తి పన్నుతో పాటు నీటి పన్ను చెల్లిస్తున్నదీ, లేనిదీ పరిశీలించాలన్నారు. ఈ ప్రక్రియ ఆగస్టు 5 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆస్తిపన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించి రూల్ బుక్ ప్రకారం వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్టు కేసులను స్టడీ చేసి.. కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించారు. కోర్టులో కేసు ఉందని ఆస్తిపన్ను వసూలుకు వెనుకాడవద్దన్నారు. ఆస్తి పన్ను వసూలు కేంద్రాలు పెంచేందుకు ప్రతి వార్డులో ప్రజలకు అందుబాటులో ఉన్న ఒక సచివాలయాన్ని ఎంపిక చేసుకుని అక్కడ అవసరమయ్యే మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆస్తి పన్ను జీవీఎంసీ కమిషనర్ అకౌంట్‌లో జమయ్యేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న బిల్ డెస్క్‌ను ప్రమోట్ చేసి, జీరో సర్వీస్ చార్జీలతో పన్నులు వసూలు అయ్యేటట్టు చర్యలు చేపట్టాలని జీవీఎంసీ ఐటీ విభాగం అధికారులను ఆదేశించారు.