
లక్ష్యాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు
మహారాణిపేట : వారాంతపు లక్ష్యాలకు అనుగుణంగా ఎన్టీఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరగాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. 2026 మార్చి నాటికి అన్ని ఇళ్లు పూర్తి కావాలని నిర్దేశించారు. బుధవారం హౌసింగ్, స్పెషల్ ఆఫీసర్లు, ఇతర అధికారులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. లక్ష్య సాధనలో విఫలమైన అధికారులు, సిబ్బందికీ మెమోలు జారీ చేయా లని హౌసింగ్ పీడీని ఆదేశించారు. ఎస్సీ, బీసీ వర్గాల వారికి రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75వేలు ప్రభుత్వం అందిస్తున్న అదనపు సాయంపై మరింత అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యుత్, తాగునీరు, డ్రెయిన్లు, అప్రోచ్ రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఫేస్ అథెంటికేషన్, స్టేజ్ అప్డేషన్ ప్రక్రియలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. వీజేపాలెం, మామిడిపాలెం లేఅవుట్లలో స్థానికుల నుంచి ఎదురవుతున్న సమస్యలను అధికారులు కలెక్టర్ దృష్టికి తీసు కొచ్చారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. గృహ నిర్మాణ శాఖ పీడీ సత్తిబాబు, ఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.