నాలుగు రోజుల వ్యవధిలోనే కుటుంబం కనుమరుగు

- - Sakshi

మధురవాడ/పీఎం పాలెం : ఆనందాల పొదరిల్లు అగ్నికి ఆహుతైపోయింది.. జీవితంపై ఎన్నో ఆశలు.. మరెన్నో కలలతో రెక్కల కష్టంతో ముందుకు సాగుతున్న ఆ కుటుంబం కలలన్నీ అగ్నికీలల్లో బూడిదైపోయాయి.. చేతికి అందొచ్చిన కుమారులను చూసుకుని మురిసిపోతున్న తల్లిదండ్రులను... ఆ తల్లిదండ్రులకు ఏ కష్టం రాకుండా వారు హాయిగా శేష జీవితం గడిపితే చూడాలనుకున్న కుమారులపై విధి కన్నెర్ర చేసింది.. ఒకరి వెంట ఒకరుగా వారం రోజుల వ్యవధిలో నలుగురినీ గ్యాస్‌ ప్రమాదం రూపంలో కబళించింది.

బతుకుతెరువు కోసం నగరానికి పొట్ట చేత పట్టుకుని వచ్చిన ఈ కుటుంబం అర్ధంతరంగా కనుమరుగవడంతో మధురవాడ వాంబే కాలనీలో విషాదం నెలకొంది. వారం రోజుల కిందట ఇంటిలో గ్యాస్‌ లీకై సంభవించిన ప్రమాదంలో తల్లిదండ్రులు, వారి ఇద్దరు కుమారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానికులు, పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం...

రెక్కల కష్టంతో జీవనం
విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామానికి చెందిన యామల బాలరాజుకు అదే జిల్లా చింతలవలస సమీపంలోని బెల్లాంకు చెందిన చిన్నితో గతంలో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు గిరి, కార్తీక్‌. వారికి మంచి భవిష్యత్‌ అందించాలన్న ఉద్దేశంతో బతుకుతెరువు కోసం పిల్లలను తీసుకుని విశాఖ నగరానికి వలస వచ్చేశారు. అలా పలుచోట్ల జీవించి 15 ఏళ్ల నుంచి మధురవాడ సమీప వాంబేకాలనీలో బ్లాక్‌ నంబర్‌ 27 బీలోని ఎఫ్‌ఎఫ్‌ 1, 2 ఇళ్లలో అద్దెకి ఉంటున్నారు. భార్య చిన్ని ఇళ్లల్లో పనులు చేస్తుండగా, బాలరాజు కార్పెంటర్‌. కుమారులు గిరి ఓ కంపెనీ ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండగా, కార్తీక్‌ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బాలరాజు, గిరి, కార్తీక్‌ కొద్ది రోజుల కిందట భవానీ మాల ధరించారు.

గ్యాస్‌ సిలిండర్‌ పిన్‌ బ్లాక్‌ అవ్వడంతో..
ఈ నెల 24న శుక్రవారం ఉదయం ఎఫ్‌ఎఫ్‌ 2 ఇంట్లో భవానీ మాలధారుల కోసం ప్రసాదం తయారు చేస్తున్నారు. ఆ సమయంలో సిలిండర్‌లో గ్యాస్‌ అయిపోవడంతో మరో సిలిండర్‌ అమర్చే క్రమంలో దాని పిన్‌ లోపలికి వెళ్లిపోయి బ్లాక్‌ అయిపోయింది. దీంతో బాగా గ్యాస్‌ లీకయింది. ఆ సమయంలో ఏమీ కనిపించక లైట్‌ వేయడంతోపాటు గదిలో దీపం కూడా ఉండడంతో... అప్పటికే ఇళ్లంతా వ్యాపించిన గ్యాస్‌ అంటుకుని అగ్నికీలలు ఎగసిపడ్డాయి. మంటలను ఆర్పేందుకు కుటుంబ సభ్యులంతా తీవ్రంగా యత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో నలుగురూ మంటల్లో తీవ్రంగా కాలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే 108 సాయంతో కేజీహెచ్‌కు తరలించారు. మరోవైపు అగ్నిమాపక శకటం మంటలను ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

అలుముకున్న విషాదం
ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ అగ్ని ప్రమాదంలో కాలిపోయి నాలుగు రోజుల వ్యవధిలోనే మృతి చెందడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాలిన గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ చిన్న కుమారుడు కార్తీక్‌(20) ఆదివారం మరణించాడు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే పెద్ద కుమారుడు గిరి (21) మంగళవారం మధ్యాహ్నం మృతిచెందాడు. అతనికి అంత్యక్రియలు నిర్వహించడం ఆలస్యమవుతుందని మృతదేహాన్ని బుధవారం ఉదయం తీసుకొద్దామని బంధువులు ఆస్పత్రిలోనే ఉంచేశారు. ఇంతలో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజు (60), అతని భార్య చిన్ని (55) బుధవారం వేకువజామున మరణించారు.

మాలధారణలో ఉండగా తండ్రి, ఇద్దరు కుమారులూ చనిపోవడంతో బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కుటుంబంలో అందరూ చనిపోవడంతో తలకొరివి పెట్టే వారు కూడా కరువయ్యారని, ఇలాంటి పరిస్థితి పగవారికి కూడా రాకూడదని స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. నాయకులు ఇచ్చిన డబ్బులతోపాటు స్థానికులు చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించి పెద్ద మనస్సు చాటుకున్నారు. మృతదేహాలకు వైఎస్సార్‌సీపీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తంశెట్టి మహేష్‌ నివాళులర్పించారు.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top