విద్యుత్‌ షాక్‌తో లేగ దూడ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో లేగ దూడ మృతి

Nov 29 2026 11:53 AM | Updated on Nov 29 2026 11:53 AM

యాలాల: విద్యుదాఘాతానికి గురై ఓ లేగ దూడ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని నాగసముందర్‌లో శనివారం జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూరేపల్లి బాలప్ప ఎప్పటిలాగే తన లేగదూడను ఊరి శివారులో మేతకు తీసుకెళ్లాడు. ఇక్కడ విద్యుత్‌ స్తంభం వద్ద షాక్‌కు గురైన దూడ అక్కడికక్కడే మృతిచెందింది. దీని విలువ రూ.60 వేలు ఉంటుందని వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

గర్భాశయ క్యాన్సర్‌ని

ముందే గుర్తించాలి

మండల వైద్యాధికారి రేవతీరెడ్డి

శంకర్‌పల్లి: మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను ముందే గుర్తించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్యాధికారి రేవతీరెడ్డి అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని సింగాపూర్‌లో మహిళలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్ల బాలికలకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందిస్తుందని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను గణనీయంగా తగ్గించొచ్చని స్పష్టం చేశారు. కార్యక్రమంలో 1, 9, 10వ వార్డు కౌన్సిలర్లు ఆనంద్‌రావు, గణేశ్‌, వసంత మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు దాటుతుండగా

కారు ఢీకొని..

ఇద్దరికి తీవ్ర గాయాలు

ఇబ్రహీంపట్నం రూరల్‌: రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్‌ కథనం ప్రకారం.. ఎల్లికట్ట గ్రామానికి చెందిన కురుమయ్య, పవన్‌కుమార్‌ శనివారం మన్నెగూడ సబ్‌స్టేషన్‌ వద్ద రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్న కారు (టీజీ05ఎఫ్‌4004) వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్‌కుమార్‌, కురమయ్య గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పవన్‌కుమార్‌ తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘనంగా పవిత్రోత్సవాలు

షాద్‌నగర్‌: ఫరూఖ్‌నగర్‌లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ పాల్గొని పూజలు చేశారు. అదేవిధంగా దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో నాయకులు రఘునాయక్‌, శివశంకర్‌గౌడ్‌, చల్లా శ్రీకాంత్‌రెడ్డి, చేగూరి లక్ష్మీప్రసన్న, వేణుగోపాల్‌, శ్రీధర్‌, ఒగ్గు కిషోర్‌, భూపాల్‌, రాయికల్‌ శ్రీనివాస్‌, కుమార స్వామి, బాల్‌రాజ్‌, ఇబ్రహీం, తుపాకుల శేఖర్‌, దంగు శ్రీను, కేకే కృష్ణ, చెంది మహేందర్‌రెడ్డి, జాంగారి రవి, అశోక్‌, బాబునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రిని కలిసిన నాయకులు

మొయినాబాద్‌రూరల్‌: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును బాకారం కాంగ్రెస్‌ నాయకులు, వార్డు సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం మండల పరిధిలోని బాకారం సమీపంలో జరిగిన కార్యక్ర మానికి విచ్చేసిన మంత్రిని నాయకులు, వార్డు సభ్యులు, ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో కలిసి, సన్మానించారు. ఆయనను కలిసిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఫిషర్‌మెన్‌ చైర్మన్‌ బాకారం మహేందర్‌ముదిరాజ్‌, వార్డుసభ్యు లు బంది అనిల్‌ముదిరాజ్‌, మాడి దినేశ్‌రెడ్డి, బంది శేఖర్‌ముదిరాజ్‌తో పాటు నాయకులు అశోక్‌యాదవ్‌, హన్ముంతుయాదవ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement