కొందుర్గు: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. శనివారం జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రంలో అధికారులు, సర్పంచ్‌లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారిగా అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులకు అందించడమే కాంగ్రెస్ సర్కారు ధ్యేయమన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 220 లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌లను ఆయన పంపిణీ చేశారు. మరో వారం రోజుల్లో మరో 28 మందికి ప్రొసీడింగ్‌లు అందిస్తామన్నారు. అదేవిధంగా చౌదరిగూడలో సీసీరోడ్లు, పాఠశాల అదనపు గదులు, పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పుష్పలత, ఇన్‌చార్జి తహసీల్దార్ భాస్కర్, ఎంపీఓ హన్మంతురెడ్డి, ఏఓ రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, పురుషోత్తంరెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, జితేందర్‌రెడ్డి, కృష్ణ, చంద్రబాబుగౌడ్, ఆంజనేయులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్


